Aug 04,2023 23:25

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి కేంద్రంతో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది. రూ.వేల కోట్ల సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించి కార్మికులకు అన్యాయం చేస్తోంది. ఈ నిధులను తిరిగి జమేయాలని కార్మికులు చేస్తోన్న డిమాండ్‌ను పట్టించుకోకపోగా, సంక్షేమ బోర్డును నిలుపుదల చేస్తూ 2021 సెప్టెంబర్‌లో మెమో 1214ను ప్రభుత్వం తీసుకొచ్చిది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని, పెండింగ్‌ క్లెయిములను పరిష్కరించాలని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భవన, ఇతర నిర్మాణ రంగాలపై ఆధారపడి 53 రకాల పనులు చేస్తున్న కార్మికులు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు.
పరిష్కారం కాని క్లెయిములు
వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి కార్మికుల పొట్టగొట్టారు. లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీశారు. సంక్షేమ బోర్డు నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ వచ్చారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ఏకంగా రూ.2,450 కోట్లు మళ్లించారు. అప్పటి నుంచి కార్మికుల క్లెయిములు పరిష్కారానికి నోచుకోలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019 నుంచి 196 మంది సహజ మరణం పొందగా వీరికి రూ.76.80 లక్షలు, ప్రమాదాల్లో మరణించిన ఎనిమిది మందికి రూ.37.20 లక్షలు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన 46 మందికి రూ.4 లక్షలు, 1,868 మంది ప్రసూతి పరిహారాలకు రూ.3.73 కోట్లు, 229 మంది అంత్యక్రియల ఖర్చులు రూ.45 లక్షలు, 105 మందికి పెళ్లి కానుకగా రూ.18 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన ముగ్గురికి రూ.7.50 లక్షలు మొత్తంగా 2,454 మందికి రూ.5.62 కోట్ల పరిహారాలు పెండింగ్‌లో ఉన్నాయి.
దశల వారీ పోరాటాల్లో కార్మికులు
దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మికులు దశల వారీ పోరాటాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ ఏడాది జులై ఒకటిన ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నెల ఒకటిన అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే మరో రెండు వారాల్లో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని కార్మికులు తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టి చలో విజయవాడకు పిలుపునిస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.