Oct 04,2023 21:29

సీతానగరంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పండు

ప్రజాశక్తి - సీతానగరం : స్థానిక ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో వందల మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ సీతానగరంలో సంక్షేమ హాస్టల్‌, పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ ప్రభుత్వం నిర్మించకపోవడం చాలా దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర మూడో రోజుకు సీతానగరం మండలం నుండి కొనసాగింది. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.పండు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా తమ విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవలేక మధ్యలో చదువు నిలిపివేసే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కావున ప్రభుత్వ వెంటనే స్పందించి మెరుగైన విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో సీతానగరం మండల కేంద్రంలో సంక్షేమ, పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటుకై ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సంక్షేమ హాస్టలకు బకాయిలుగా నిలిచిన మెస్‌ ( డైట్‌ ) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని లేనిచో యాత్ర అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్‌, నాయకులు కె.రాజు, హెచ్‌.సింహాచలం, బి.గంగారావు, కె.భాస్కరరావు, అఖిల్‌, ఉమాశంకర్‌, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట: జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర బలిజిపేట మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రకు స్వాగతం పలుకుతూ గ్రామంలో సైకిళ్లతో ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పిఎస్‌ఎన్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి. రాజశేఖర్‌ మాట్లాడారు. మండలంలో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు మధ్యలో చదువు నిలిపివేస్తున్నారని, కావున తక్షణమే ప్రభుత్వం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో బలిజిపేట మండల కేంద్రంలో సంక్షేమ, పోస్టుమెట్రిక్‌ హాస్టలు మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటుకై ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఇపి, 117 జిఒరద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. హాస్టళ్లలో ఏఎన్‌ఎం లను నియమించాలని, లేకుంటే యాత్ర అనంతరం పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని హెచ్చరించారు.