ప్రజాశక్తి-పెందుర్తి : సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు డిమాండ్‌చేశారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన 'విద్యార్థి సంఘర్షణ సైకిల్ యాత్ర' సోమవారం పెందుర్తి చేరుకుంది. పెందుర్తి ప్రాంతంలోని ప్రభుత్వ బాలురు, బాలికల వసతి గృహాలను సందర్శించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలనడిగి తెలుసుకున్నారు. మేఘాద్రి అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలనడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్‌జె.నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ బాలురు, బాలికల వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్యాన్లు లేవని, ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందలేదని తెలిపారు. జిఒ 77ను ప్రవేశపెట్టి పీజీ విద్యార్థులకు విద్యాదీవెన లేకుండా చేశారని, దీంతో పేదలు ఉన్నత చదువులకు వెళ్లకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. జిఒలు 107, 108 ద్వారా వైద్య విద్యను ప్రయివేటు పరం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఈ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.










