ప్రజాశక్తి - పోలవరం
ఇటీవల పులిరామన్నగూడెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి హత్యకు గురైన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఐటిడిఎ పిఒ జివి.సత్యనారాయణ, పోలవరం తహశీల్దార్ బి.సుమతి మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలను విస్తృత తనిఖీలు చేశారు. అంతకుముందు శుక్రవారం రాత్రి వింజరం పంచాయతీ బోడిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తహశీల్దార్ తనిఖీలు నిర్వహించి విద్యార్థుల ఆహార నాణ్యతను, మౌలిక సదుపాయాలను పరిశీలించి వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి నిద్రించారు. పోలవరం బాపూజీకాలనీ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహంలో ఐటిడిఎ పిఒ జివి.సత్యనారాయణ తనిఖీలు చేపట్టారు. మౌలిక వసతులు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి శుక్రవారం రాత్రి నిద్రించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు, ఆహార పదార్థాల నాణ్యత శానిటైజేషన్ తదితర అంశాలపై వసతి గృహ సంరక్షకులకు పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
భీమడోలు : ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు తమకు అందుతున్న సేవలను వినియోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మండల ప్రత్యేక అధికారి, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు కోరారు. స్థానిక బిసి బాలుర ప్రత్యేక వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. వారితో కలిసి రాత్రి నిద్రించారు. మర్నాడు శనివారం ఉదయం వారితో పాటు అల్పాహారం తీసుకుని భీమడోలు హై స్కూల్‌ను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న విద్యాబోధన, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, ఇతర అంశాలను పరిశీలించారు. వసతి గృహ విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. విద్యార్థులతో మమేకమై వారు చదువుతున్న తీరు ఇతర అంశాలను పరిశీలించారు. పలుసూచనలు చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమకు జగనన్న విద్యా కానుక పూర్తిస్థాయిలో చేరలేదని ప్రత్యేకాధికారి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన వసతి గృహ సంరక్షకులు ఎల్.గురుబాబు మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించిన పాదరక్షల సైజులు తేడాగా ఉండటం వల్ల వాటిని వెనక్కి పంపామని, తిరిగి అవి వచ్చిన తర్వాత వాటిని అందజేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య కూడా ఉందని వసతి గృహ సంరక్షకులు తెలిపారు. హాస్టల్ ఆవరణలో బోరు ఉన్నప్పటికీ మోటారు లేని కారణంగా దాని సేవలను నిరుపయోగంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సెప్టిక్ ట్యాంక్ సైజు లేకపోవడంతో తరచుగా అది నిండిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రెయినేజీ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వానాకాలంలో హాస్టల్‌కు ముంపుసమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, విద్యార్థుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారితో పాటు మార్క్‌ఫెడ్ సహాయ సంచాలకులు మహేంద్రనాధ్ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : స్థానిక ఉప్పలమెట్టలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజరాజేశ్వరి తేజస్వి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాటా డారు. పాఠశాలలో చదువు, భోజనం నాణ్యత, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య క్రమంలో స్థానిక సిఐ పి.రాజేష్ పాల్గొన్నారు.










