Aug 14,2023 21:05

డిప్యూటీ సిఎంకు వినతినిస్తున్న యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి - సాలూరు : ప్రభుత్వ బిసి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు, కస్తూరిబా, జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో జిసిసి సబ్బులు, ఉత్పత్తులను వినియోగించేలా చూడాలని కోరుతూ సోమవారం జిసిసి సోప్‌ యూనిట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిప్యూటీ సిఎం రాజన్నదొరను కోరారు. యూనియన్‌ అధ్యక్షులు సిహెచ్‌.సంతోషికుమారి, కార్యదర్శి ఎన్‌.సుజాత ఆధ్వర్యాన సోప్‌ యూనిట్‌ ఉద్యోగులు డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. జిసిసి సబ్బులు తయారీ యూనిట్‌ విజయనగరంలో 16మంది ఉద్యోగులు పని చేసేవారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్ధులకు జిసిసి సబ్బులు, ఇతర ఉత్పత్తులు సరఫరా జిసిసి ద్వారా సరఫరా జరిగేవని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద నేరుగా విద్యార్ధుల తల్లులు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడంతో వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మెటిక్స్‌ నిలిపివేసినట్లు తెలిపారు. దీని వల్ల సోప్‌ యూనిట్లలో ఉత్పత్తుల వినియోగం నిలిచిపోయిందని, ఫలితంగా యూనిట్‌ మూతపడే స్థాయికి చేరుకుందని చెప్పారు. ఈ కారణంగా యూనిట్‌లో పనిచేసే ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. కావున సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో సబ్బులు, జిసిసి ఉత్పత్తుల వినియోగం జరిగేలా చూడాలని యూనియన్‌ నాయకులు సంతోషికుమారి, సుజాత కోరారు. దీంతో అక్కడే వున్న జిసిసి డిఎం మహేంద్ర కుమార్‌ను పిలిచి సమస్య పరిష్కారమయ్యేలా విధివిధానాల గురించి రాజన్నదొర చర్చించారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజన్నదొర హామీ ఇచ్చారు.