సంక్షేమ హాస్టళ్ల బిల్లులు తక్షణం ఇవ్వాలి
ప్రజాశక్తి-కావలి : సంక్షేమ హాస్టల్లో ఐదు నెలల నుంచి బిల్లులు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లండన్లో విహారయాత్రలు చేయడం న్యాయమా అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి ప్రశ్నించారు. సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సమితి ఆధ్వర్యంలో ధర్నా చేసి, ఆర్.డి.ఒ. వి.కె. శీనానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ హాస్టల్లో డ్కెట్ బిల్లులు రాక జూన్ నుంచి ఇప్పటివరకు రాకపోవడంతో నాలుగు నెలల నుంచి వార్డెన్లు అప్పులు తెచ్చి పెడుతూ, నాసి రకమైన పదార్థాలు పెడుతున్నారని తెలియజేశారు. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1450, 5వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.1250 అతి తక్కువ ధరతో మూడు పూటలా అన్నం పెట్టడం పూర్తిగా ఆహారం ఇవ్వడం చాలా కష్టమైనప్పటికీ నాలుగు నెలల నుంచి బడ్జెట్ ఇవ్వకపోగా చిన్న పిల్లలకు బాల బాలికలకు కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వకపోవడంతో డబ్బులు లేక అల్లాడిపోతున్నారని తెలియజేశారు. వచ్చిన డబ్బులు కూడా బిల్లులు అకౌంట్‌లో వేయడంతో బ్యాంకు వారు అప్పులకు జమ చేసుకుంటున్నారని తెలియజేశారు. అంతటి దారుణ పరిస్థితులు సంక్షేమ హాస్టల్లో ఉన్నాయని తెలియజేశారు. ఇప్పటికే అనేక సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థులు చేరడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికల హాస్టళ్లను అన్ని ఎత్తివేయడంతో పెద్దపెద్ద కార్పొరేట్ పాఠశాలల్లో చేరలేక దళిత గిరిజనులు ఉపాధి పనులకు పోతున్నారని తెలియజేశారు. కనీసం హాస్టళ్లలో నాడు - నేడు అని చెప్పి ఒకతలుపు కూడా పెట్టకపోవడం, తలుపులన్నీ ఊడిపోయి, దోమల తోటి నిండిపోతున్నాయని తెలియజేశారు. ఇప్పటివరకు ఒక్క దుప్పటి గానీ, గ్లాసు గానీ ఇవ్వకపోగా సంక్షేమ హాస్టళ్లలో అనాథ బిడ్డలకు బతుకుతున్నారని తెలియజేశారు. బడ్జెట్ పేరు చెప్పి, అధిక ధరలకు కొటేషన్లు ఇవ్వడం వల్ల ఆ భారం అంతా కూడా పిల్లల డైట్ బిల్లులపై పడి ఇబ్బంది జరుగుతుందని తెలియజేశారు. అధిక కొటేషన్ల వల్ల రూ.125 ఉన్న కందిపప్పు రూ.185 కొటేషన్ వేసి అధికారులు దోపిడీకి పాల్పడు తున్నారని, ఈ డబ్బు పిల్లలపై పడుతుంది కాబట్టి, సమగ్ర విచారణ చేసి డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు, హాస్టళ్ల మెయింటెనెన్స్, అన్ని ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యానాది సమాఖ్య జిల్లా అధ్యక్షులు బాపట్ల సత్యవతమ్మ, హేమంత్, వినోద్, పవన్, మాల కొండయ్య, రాకేష్, శారద, తదితరులు పాల్గొన్నారు.










