
* నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి
* భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల డిమాండ్
* ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన
ప్రజాశక్తి - పోలాకి: నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని రద్దు చేస్తే సహించేది లేదని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సంఘ నాయకులు టి.లక్ష్మణరావు, బి.సిమ్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిలిపివేసిన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను పునరుద్ధరించి, భద్రత లేని కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై మబగాంలోని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ క్యాంపు కార్యాలయం ఎదుట నిర్మాణ కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం క్లయిమ్స్‌ను నిలుపుదల చేసి నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడకుండా చట్ట ప్రకారం నిర్మాణ యజమానుల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేసి, నిర్మాణ కార్మికులకు మరణం, అంగవైకల్యం, వివాహం, ప్రసవం, వైద్య ఖర్చులు వంటి సందర్భాల్లో క్లయిమ్స్ రూపంలో సంక్షేమ చట్టం ద్వారా అందేవన్నారు. దీంతో నిర్మాణ కార్మికులకు కొంతమేరకైనా ఉపశమనం లభించేదని చెప్పారు. నిర్మాణ యజమానుల నుంచి వసూలు చేసిన సెస్ నిధులు నిర్మాణ కార్మికుల కోసమే ఖర్చు చేయాలని, ఇతర అవసరాలకు మళ్లించరాదని చట్టం చెప్తోందని గుర్తుచేశారు. సెస్ వసూలు కొనసాగుతున్నా, చట్ట విరుద్ధంగా క్లయిమ్స్ నిలుపుదల చేసి ఇతర అవసరాలకు ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని తెలిపారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికులు పలురూపాల్లో ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని క్లయిమ్‌లను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర అవసరాలకు మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాలన్నారు. భవిష్యత్తులో వసూలైన సెస్ నిధులను నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని, లేకుంటే రాష్ట్రంలోని సుమారు 30 లక్షల మంది నిర్మాణ కార్మికుల కుటుంబాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణదాస్‌కు వినతిపత్రం అందజేయగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో నిర్మాణ కార్మికులు టి.వెంకటరావు, ఎల్.అక్కునాయుడు, ఎస్.ఉమ, పి.రాము, నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు మండలాల నుంచి పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.