ప్రజాశక్తి.-అనకాపల్లి :కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎల్‌వి రమణ అధ్యక్షతన జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సంఖ్యగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు. సంక్షేమ బోర్డు నిధులు వేలకోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. మరోపక్క భవన నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటడంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. సంక్షేమ బోర్డును ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. సమావేశంలో ఎఐటియుసి జిల్లా కన్వీనర్ వై ఎన్ భద్రం, సంఘం జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ, జిల్లా సమితి సభ్యులు దుక్క ఈశ్వరరావు, అమర్, వియ్యపు రాము, కర్రీ శ్రీను, నామాల కష్ణ, దేవుళ్ళు, రామునాయుడు, సన్యాసిరావు, అప్పారావు పాల్గొన్నారు.










