ప్రజాశక్తి-సత్తెనపల్లి : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రెండు నెలల్లో పునరుద్ధరించాలని, నాలుగున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్లైమూల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికలలో భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి పంపిస్తారని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వి.నరసింహారావు అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మంత్రి అంబటి రాంబాబు వద్దకు శుక్రవారం సామూహిక రాయబారం నిర్వహించగా తొలుత భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ అధ్యక్షతన స్థానిక గార్లపాడు సెంటర్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో నరసింహారావు మాట్లాడారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకున్నారని అన్నారు. ఈ చట్టంలోని సంక్షేమ బోర్డు నిధులు గత ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించితే భవనిర్మాణ కార్మికులు చేసిన ఆందోళనలో జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాల కంటే కూడా మెరుగైన విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తానన్నారని గుర్తు చేశారు. నిర్మాణదారులు నుండి వస్తువులు చేసిన 1 శాతం డబ్బులు కార్మికుల సంక్షేమ పథకాలకు ఖర్చు చేయవచ్చునని, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించిన అవసరం లేదని అన్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో రెండేళ్లపాటు కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సిమెంటు, స్టీలు ఇతర మెటీరియల్ ధరలన్నీ విపరీతంగా పెరగడతో కార్మికులకు పనులు తగ్గి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. జిల్లాలో అనేక మంది కార్మికులు ఆకలి మరణాలు సంభవించాయని అన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 2381 గాను రూ.5 కోట్ల 99 లక్షల 21 వేలను సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికులకు బకాయి ఉందని, ఈ క్లైమూల పరిష్కారానికి అడ్డంకిగా ఉన్న 1214 మెమోను వెంటనే రద్దుచేసి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గరీబి కళ్యాణ యోజన పథకం అమలు చేయడం కోసం కార్మికుల దగ్గర నుండి ఆధార్ బ్యాంక్ ఎకౌంటు కార్మికులకు గుర్తింపు కార్డులు జిరాక్స్ కాపీలు సేకరించినా ఏ ఒక్క కార్మికునికి కూడా ఒక రూపాయి కూడా ఎకౌంట్లో వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
కార్మికులకు మద్దతుగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్ ఆంజనేయ నాయక్, సహాయ కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ కార్మికుల తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, కొమ్మిశెట్టి సాంబశివరావు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజరు కుమార్ మాట్లాడారు. అనంతరం గార్లపాడు బస్టాండ్ సెంటర్ నుండి గాంధీ బొమ్మల సెంటర్, వెంకటరమణ హోటల్ సెంటర్, తాలూకా సెంటర్,పాత బస్టాండ్ సెంటర్, మీదగా మంత్రి అంబటి రాంబాబు క్యాంప్ ఆఫీస్ వద్దకు ప్రదర్శనగా వెళ్లారు. క్యాంప్ ఆఫీస్ లో మంత్రి అంబటి రాంబాబు లేకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల వస్తున్న సంగతి ముందుగా తెలిసి కూడా లేకుండా పోవడం కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ శోభన్‌బాబు సూచనల మేరకు మంత్రి పిఎకు వినతి పత్రం ఇచ్చారు. సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎ.వీరబ్రహ్మం, షేక్ సైదులు, కె.ఆంజనేయులు, బి.ఏడుకొండలు, షేక్ పెద్దమీరా, జె.రాజకుమార్, పి.మహేష్, ఆర్.సుమన్ పాల్గొన్నారు.










