Dec 02,2022 00:10

తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్టును పునరుద్ధరించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన గురువారం భవన నిర్మాణ కార్మికులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలిత రాజవొమ్మంగిలో భారీ ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.రాంబాబు, పి.శ్రీను, నాగు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. సెస్‌ రూపంలో వసూలు చేసిన సంక్షేమ బోర్డు నిధిని రాష్ట్రం ప్రభుత్వం సుమారు రూ.1280 కోట్లు దారి మళ్లించి కార్మికులు పొట్ట కొట్టిందని విమర్శించారు. దీంతో కార్మికులకు రావలసిన క్లైములు, ఇతర బెనిఫిట్స్‌ ఏవీ కూడా అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకు జమచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు శ్రీను, అప్పారావు, నూకరాజు, వీరబాబు, చిట్టిబాబు, ఈశ్వరరావు, సత్తిబాబు, యోహాన్‌ పాల్గొన్నారు.