జిల్లావ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి - కలిదిండి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పున:ప్రారంభించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. 1214 మెమోను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, రూ.1280 కోట్లు సంక్షేమ బోర్డుకు జమచేయాలని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందచేశారు. తొలుత మార్కెట్ యార్డ్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు పోతురాజు బాలాజీ, పరసా రాజేష్, కటికల శ్రీనివాస్, బత్తిన సూరిబాబు, అబ్దుల్ అక్బర్, సుంకర హరి, సానబోయిన సత్యన్నారాయణ, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
నిడమర్రు : మండలంలోని భువనపల్లి, అడవికొలను, పెదనిండ్రకొలను, ఛానమిల్లి గ్రామ సచివాలయాల్లో కార్యదర్శులకు భవన నిర్మాణ కార్మికులు వినతిపత్రాల అందించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణరావు మాట్లాడుతూ నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోసూరి శివ, రోకలి ఏసురెడ్డి, కానూరు శ్రీనివాసు, చినిమిల్లి రాంబాబు, సోడాబత్తుల శివ, ఆసుప హరిప్రసాద్ పాల్గొన్నారు.
పెదపాడు:భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలను అమలు ప్రారంభించాలని, పథకాలను నిపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 1214 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండలం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ముమ్మడి గోపాలకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం దారి మళ్లించిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సంక్షేమ బోర్డుకు జమచేయాలని, బోర్డును యథావిధిగా నిర్వహించాలని కోరారు. సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నష్టపోకుండా కార్మికుల సంక్షేమ చట్టాలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.వెంకట అప్పారావు, డి.సురేష్, ఎం.ప్రభాకర్, షేక్ కరీముల్లా, కె.ఆంధ్రేసు, ఎ.నాగరాజు, జి.సుకాంత్ పాల్గొన్నారు.
ఉంగుటూరు : భవన నిర్మాణ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ పథకాలను రాష్ట్రప్రభుత్వం నిలుపుదల చేసి వారి బతుకులపై దెబ్బకొట్టిందని సిఐటియు జిల్లా కార్యదర్శి కొక్కిరిపాటి వెంకట్రావు అన్నారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ ఎవి.రమణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టిన సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేశారన్నారు. పన్నుల రూపంలో వసూలైన రూ.1280 కోట్ల నిధులను దారి మళ్లించారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ప్రజాస్వామ్యవాదిగా ఫోజులు పెట్టి అధికారంలోకి రాగానే నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ బీమా కార్మికులకు అందడం లేదని, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం మినహా మృతిచెందిన కార్మికులకు బీమా పరిహారం ఇవ్వడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లయిములను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు సీరా అప్పారావు, అనుపోజు వీరవెంకటబ్రహ్మం, వానపల్లి వీర్రాజు, ఎం.నాని, సూర్యనారాయణ, కె.రాంబాబు, మరడాని సోమాచారి, దివిలి రాంబాబు, ఎం.శ్రీనివాసరావు, కొత్తలంక శేషారావు, ఎం.వెంకట్, కె.సిద్ధాచారి పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని పలు సచివాయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు నిర్మాణ కార్మికుల సంఘం మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కొయ్యలగూడెం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల నిలుదలను విరమించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్ల బోయిన రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దిప్పకాయలపాడు సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ ఎస్.కృష్ణ, షేక్ బాష, సురేష్ కృష్ణ పాల్గొన్నారు.










