సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా
కలెక్టరేట్: భవనిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధ రించాలని, గతంలో రూపొందించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దావాల రమణారావు, వై.మన్మధరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె గౌరీశ్వరరావు, ఆర్.రాము, మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భవనిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రూ.2450 కోట్లు భవనిర్మాణ కార్మికుల సెస్ నుండి సేరించిన నిధులను వారి సంక్షేమానికి ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకొని కార్మికులను మోసగించిందని విమర్శించారు. ఇసుక అందుబాటులో లేకుండా చేసి భవనిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా చేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఈ నిర్లక్ష్యాన్ని విడనాడాలని నాయకులు కోరారు. ఇసుక, సిమెంటు, ఐరన్ ధరలు పెరుగుదల ప్రభావం కార్మికులకు పనులు లభ్యతపై పడిందని, ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను, ప్రజలను ఆదుకునేలా ఇసుక, సిమెంటు, ఐరన్ ధరలు తగ్గించాలని కోరారు. కరోనా కాలంలో మరణించిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.6వేలు చొప్పున ప్రతి నెలా పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఇప్పటికే అనేక దఫాలుగా ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డును పునరుద్దరిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అత్తముడి లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గార చిన్నారావు, వీరనాయుడు, కె.సూర్యనారాయణ, ఎం.సోమేశ్వరరావు, ఆర్ శ్రీను, ఎం.రవి, ఎం.గణపతి, పెద్దఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.










