ప్రజాశక్తి - నిడమర్రు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్దరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణరావు ప్రభుత్వాన్ని కోరారు. భువనపల్లిలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి బుధవారం ధర్నా నిర్వహించారు. గోక సూరిబాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో రమణరావు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో 25 లక్షల మంది కుటుంబాలకు ఉపయోగపడే సంక్షేమ బోర్డును అమలులో లేకుండా ఇచ్చిన మెమో 1214ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకే ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా రూ.1240 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందన్నారు. తక్షణం ఆ నిధులను సంక్షేమ బోర్డుకు జమ చేసి కార్మికుల కుటుంబాలకు పెండింగ్ క్లెయిములు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేనిపక్షంలో రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కోన శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ ధర్నాలో కోసూరి ఏసు, వల్లపు రమణ, ఎం.సూరిబాబు, వి.వెంకట్, రమేష్, రాంబాబు పాల్గొన్నారు.










