ప్రజాశక్తి - అడ్డతీగల
భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన సంక్షేమ బోర్డు నిధులు వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామరాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తాపీ మేస్త్రుల సమావేశ మందిరంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మొదటి మహాసభ ఆ సంఘం గౌరవ అధ్యక్షులు సీహెచ్ శ్యామ్యాల్ అధ్యక్షతన జరిగింది. తొలిత భవన నిర్మాణ కార్మికులు అడ్డతీగల గ్రామంలో ర్యాలీ, ధర్నా చేశారు. అనంతరం జరిగిన మహాసభలో పి.రామరాజు, సిఐటియు జిల్లా నాయకులు బి.నిర్మల, జి.రమేష్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన రూ.435 కోట్ల నిధులు ఇతర సంక్షేమ పథకాలకు వాడుకుందని తెలిపారు. ఆ నిధులన్నీ జమ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకపోగా రూ.1280 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్ళించారని తెలిపారు. జీవో నెంబర్ 1214 తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల క్రైములు దరఖాస్తులు తీసుకోకుండా ఆపేశారన్నారు. పెండింగ్లో ఉన్న గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని, బిల్డింగ్ మెటీరియల్ రేట్లను నియంత్రించాలని, పిల్లల పెళ్ళికానుక లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కమిటీ ఎన్నిక
అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సిహెచ్.శామ్యూల్, అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్.కొండబాబు, జి.సురేష్, ఉపాధ్యక్షులుగా జి.సత్యనారాయణ, సిహెచ్.బాల్‌రెడ్డి, జి.కన్నబాబు, సహాయ కార్యదర్శులుగా చాగంటి ఆదినారాయణ, డి.శ్రీను, కె.కాసులమ్మ, ఎల్.వెంకటచలం ఎన్నికయ్యారు.










