Nov 20,2023 21:03

గోరుకల్లు రిజర్వాయర్‌ వద్ద పంపింగ్‌ స్టేషన్‌ను సందర్శించిన మంత్రి బుగ్గన

సంక్రాంతికి వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి
- క్రిస్మస్‌కల్లా గోరుకల్లు నుంచి బుగ్గానిపల్లె నీటిశుద్ధి కేంద్రానికి నీరు
- ఫిబ్రవరి ఆఖరికి డోన్‌ నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరందిస్తాం
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ప్రజాశక్తి - బేతంచెర్ల/పాణ్యం

     సంక్రాంతి పండగ కల్లా బేతంచెర్లకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనుల పూర్తికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు. క్రిస్మస్‌ నాటికల్లా పాణ్యంలోని గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి బేతంచెర్లలోని బుగ్గానిపల్లె తండాలో నిర్మిస్తోన్న నీటి శుద్ధి కేంద్రానికి నీరు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల మండలాలన్నింటికీ తాగునీరిస్తామన్నారు. సోమవారం గోరుకల్లు రిజర్వాయర్‌, బుగ్గానిపల్లె తండాలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లను మంత్రి సందర్శించారు. గోరుకల్లు నుండి డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలికి వెళుతున్న తాగునీటి పైపులైన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బేతంచెర్లలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రితో మేఘా నిర్మాణ సంస్థ ఎండి పివి.కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 217 కోట్ల రూపాయలతో 138 గ్రామాలకు రోజుకు 15 క్యూసెక్కుల నీటిని డోన్‌ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపడుతున్న పైప్‌లైన్‌ నిర్మాణపనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పైపులు, మ్యాన్‌ పవర్‌ కొరతపై దృష్టి సారించి మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు కావాల్సిన అటవీ, జాతీయ రహదారుల అనుమతులు సహా సవరించిన అంచనా మొత్తానికి ఆమోదం తెలిపారన్నారు. మేఘా ఎండి కష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరిగతిన పూర్తి చేయడం కోసం మరో 600 మందిని వారంలోగా ప్రాజెక్టు మేనేజర్లు, ఇన్‌ఛార్జ్‌లు, కో ఆర్డినేటర్లు, కార్మికులను నియమిస్తామని మంత్రికి వివరించారు. 6 క్లస్టర్లను పూర్తి చేసేందుకు 20 బృందాలను నియమించుకుని రెండు షిఫ్టులుగా పని చేసేలా చర్యలు చేపడతామన్నారు. మూడవ క్లస్టర్‌ పనులు పూర్తి చేసేందుకు సాంకేతికంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశమున్న నేపథ్యంలో సమాంతరంగా మిగతా పనులపై దృష్టి సారిస్తామన్నారు. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు 5 పంప్‌ హౌస్‌లు, రైల్వే క్రాసింగ్‌లు, ఇటుక,విద్యుత్‌ పనులకు కావలసిన సమగ్ర వనరులను వారంలోగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. బలపాలపల్లె, బుగ్గానిపల్లె, ముగ్ధవరం ప్రాంతాల్లో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సుగాలి మెట్ట దగ్గర వాటర్‌ పైప్‌ లైన్‌కు అవసరమైన రక్షణ ఏర్పాట్లు చూడాలన్నారు. పైప్‌ల కొరతను అధిగమించేలా అవసరమైతే విజయవాడ నుంచి తీసుకువస్తామని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, జిల్లా ఎస్పీ రఘువీర్‌ రెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.