ప్రజాశక్తి-విజయవాడ
సంక్రాంతి సంబరాల ముగింపులో భాగంగా కృష్ణలంక 21వ డివిజన్ సుందరయ్య గ్రంథాలయం సెంటర్‌లో గురువారం రాత్రి బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. వివిధ రకాల ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోని 265 మంది విజేతలకు బహుమతులను అందజేశారు. జానపదం, క్లాసికల్, కోలాటం తదితర 18 రకాల కళారూపాల్లో 85 మంది చిన్నారుల ఆటపాట విశేషంగా ఆకట్టుకున్నాయి. పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చిగురుపాటి బాబూరావు, స్థానిక మాజీ కార్పొరేటర్, పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ దోనేపూడి కాశీనాధ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బాబూరావు, కాశీనాధ్ మాట్లాడుతూ నేడు ఆట-పాటలకు ప్రభుత్వాల నుంచి ఆదరణ కరువైందన్నారు. సంక్రాంతి అంటే పేకాట, కోడిపందాలు, ఇతర జూదాలే ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ నేతలకు గుర్తుకొస్తాయని విమర్శించారు. క్రీడలు కూడా కార్పొరేటీకరణ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటలు, పాటలకు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు కరువయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు డాక్టర్ హర్షవర్ధన్, సూర్యదేవర నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా నాయకులు కాజ సరోజ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి కృష్ణ, పౌరసంక్షేమ సంఘం నాయకులు కోరాడ రమణ, వి రంగారావు, డివైఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి కె శివాజి, సిఐటియు నాయకులు వి గోపి, ఎ లక్ష్మణకుమార్, కె కుమార్, కె లక్ష్మీనారాయణ, డాన్స్ టీచర్లు రమాదేవి, భాను, అలేఖ్య, పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి బి అప్పన్న, ఐద్వా నాయకులు ఆషా తదితరులు పాల్గొన్నారు.










