Jan 14,2023 23:36

భోగి మంటను కాగుతున్న ఎమ్మెల్యే, కుటుంబీకులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:తెలుగు వారంతా.. ఎంతో సంతోషంగా, ఘనంగా జరుపుకునే పండగలలో ముఖ్యమైనది సంక్రాంతి. మూడు రోజుల సంబరం శనివారం బోగి వేడుకలతో ఆరంభమైంది. ఆదివారం సంక్రాంతి, సోమవారం కనుమ పండుగ నిర్వహించుకోనున్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలో వ్యాపార కూడళ్లు జనాలతో కిక్కిరి పోయాయి. పట్టణ పురవీధుల్లో గంగరెద్దులు కనువిందు చేశాయి. స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం, మరిడమ్మ దేవాలయం, ఉత్తర వాహిని తీరం వద్ద సందడి నెలకొంది. యువత పాటలతో కోలాహలం సంతరించుకుంది. అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద భారీ విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. అబీద్‌ సెంటర్‌, పెద్ద బొడ్డేపల్లి పెద్ద మధుం వరకు వ్యాపార కూడళ్లలో కోలాహలం కనిపించింది. హౌల్‌ సేల్‌ వస్త్ర దుకాణాలు, నిత్యవసర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగను సొంత ఊళ్లలో జరుపుకోవడానికి జనం పట్టణాలు వదిలి కుటుంబాలతో పల్లెలకు చేరుకున్నారు. రెండు రోజులుగా బస్టాండ్‌, ఇతర కూడళ్లు జనంతో రద్దీగా కనిపించాయి. పట్టణాల నుంచి కుటుంబసభ్యుల రాకతో ప్రతీ ఇల్లు సందడిగా మారింది. పిండివంటల ఘుమఘుమలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, బసవ్వన్నలతో పట్టణంతో పాటుగా పల్లెల్లో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.
ఉత్తరాయన పుణ్య కాలంలో మార్గశిర పుష్పమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు. సంక్రాంతి ఎన్నెన్నో సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఆధునిక పోకడలతో పండుగలో కొంత కళ తగ్గిపోతున్నా రంగవల్లులు తీర్చి దిద్దడంలో మహిళలు మాత్రం పోటీ పడుతూనే ఉన్నారు. చిన్నారులు పంతగులతో సందడి చేస్తున్నారు. సంక్రాంతిలో భాగంగా ఇళ్ల ముందు వేసే ముగ్గుల్లో గొబ్బెమ్మలు ఆవుపేడతో ముద్దలు చేసి ముగ్గుల మధ్యన పెట్టి పసుపు, కుంకుమ అద్ది పిండితో ముగ్గులు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు.బోగిపండ్లతో చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు.సంక్రాంతి అంటేనే ముందుగా అందరికీ గుర్తొచేది పిండి వంటలు. నోరూరించే ఘుమఘుమలు స్వాగతం పలుకుతాయి.
స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ కుటుంబ సమేతంగా బోగి మంటలు వేసి పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక గచ్చపొవీధిలో కొరుపోలు అప్పలరాజు, కొరుపోలు శ్రీనివాసరావు సంక్రాంతి పండుగ సందర్భంగా చెరుకు గెడలను ఉచితంగా పంపిణీ చేశారు.





........................