అరిసెలు :
కావాల్సిన పదార్థాలు :
బియ్యం - కిలో, బెల్లం - అరకిలో, నువ్వులు - 50 గ్రాములు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం :
ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం వేయాలి. అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకుని తీగపాకం పట్టుకోవాలి.
తర్వాత బియ్యంపిండిని పాకంలో వేసి బాగా కలిపి దించేయాలి. స్టౌ మీద ఒక పాన్ పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి.
నూనె బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు/ కవర్‌పై అరిసెల్లా ఒత్తుకోవాలి.
వాటిని కాగిన నూనెలో వేయాలి. రెండువైపులా వేగేలా తిప్పుకోవాలి. బంగారువర్ణం వచ్చాక నూనె ఒత్తుకుని, ఒక ప్లేటుపై నువ్వులు వేసి వాటిపై తయారైన అరిసెలను అద్దుకోవాలి. అంతే అరిసెలు రెడీ.
బందరు లడ్డు
కావాల్సిన పదార్థాలు :
శనగపిండి - కప్పు, నెయ్యి - పావు కేజీ, జీడిపప్పు - సరిపడా, పంచదార - కప్పు, కుంకుమపువ్వు - తగినంత.
తయారుచేసే విధానం :
ముందుగా శనగపిండిని తీసుకుని దానికి సరిపడా నీళ్లు కలిపి ముద్దచేసి దానిని కారప్పూసలాగా వేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కారప్పూసను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో పంచదార వేసి, పావుకప్పు నీళ్లలో కుంకుమపువ్వు వేయాలి. అందులోనే చక్కెర కలిపి సరిపడా నీళ్ళుపోసి పాకం పట్టుకోవాలి.
తయారైన పాకంలో మనం తయారుచేసుకున్న పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పులను, యాలకుల పొడిని తయారుచేసుకుని వీటిని కలుపుకున్న ముద్దలో వేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి. అంతే బందరు లడ్డులు రెడీ....
పప్పు చెక్కలు
కావాల్సిన పదార్థాలు :
బియ్యంపిండి- కేజీ, నూనె - అరకేజీ, పచ్చి శనగపప్పు - 150 గ్రాములు, పెసరపప్పు - 100 గ్రాములు, కరివేపాకు - కట్ట (చిన్నగా కట్ చేయాలి), కొత్తిమీర - కట్ట (కట్ చేసినది), అల్లం పచ్చిమిర్చిపేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - సరిపడా.
తయారుచేసే విధానం :
పప్పులు రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండిలో నానపెట్టిన పప్పులు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి ముద్ద, వంటసోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లుపోసి ముద్దగా కలిపి ఉంచాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్‌లోకి నూనె తీసుకోవాలి. అది కాగిన తరువాత, పిండిని కొంచెం తీసుకొని, ఉండలు చేసి చిన్న పాలిథిన్ కవరు మీద అప్పడంలా ఒత్తుకోవాలి.
దానిని కాగిన నూనెలో వెయ్యాలి. అవి బంగారు రంగులోకి వేగాక తీసి ప్లేటులో పెట్టాలి. చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి. ఇవి నెలరోజులు నిల్వ ఉంటాయి.
చక్రాలు
కావాల్సిన పదార్థాలు :
బియ్యం పిండి - కిలో, వెన్న - 100 గ్రాములు, నువ్వులు - 50 గ్రాములు, వాము - రెండు టీ స్పూన్లు, కారం - తగినంత, ఉప్పు - సరిపడినంత, నూనె - కిలో.
తయారుచేసే విధానం :
ముందుగా పాన్‌లో నూనెపోసి, చిన్న మంట మీద పెట్టుకోవాలి.
ఒక పెద్ద పళ్ళెంలో బియ్యంపిండి వేసి, అందులో వెన్నను వేడిచేసి వేసుకోవాలి.
తర్వాత వాము, ఉప్పు, కారం, నువ్వులు, కాగుతున్న నూనె రెండుస్పూన్లు వేసుకొని, బాగా కలపాలి. ఇంకా అందులోనే రెండు గ్లాసుల నీళ్లుపోసి, చపాతి పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు సరిపోకపోతే మరి కొంచెం కలుపుకోవచ్చు.
నూనె బాగా కాగిన తరువాత, చక్రాల గొట్టంలో ముద్దను పెట్టి, నూనెలో చక్రాలు ఒత్తుకోవాలి.
చక్రాల గొట్టాలలో రకరకాలైన ఆకారాలతో ఉన్న ప్లేట్లు ఉంటాయి. అందులో మనకు కావలసినది పెట్టుకుని, వివిధ రకాలుగా చక్రాలు చేసుకోవచ్చు. అంతే! రుచికరమైన చక్రాలు రెడీ.