ప్రజాశక్తి-డుంబ్రిగూడ: పాత పెన్షన్ సాధనకై పాడేరులో జరిగే సంకల్ప దీక్ష సభను ప్రభుత్వం అరెస్టులతో భగం చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర కార్యదర్శి వి.మహేష్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు నేరం చేసినట్లుగా ముందస్తు నోటిసులు ఇచ్చి అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సంకల్ప దీక్షను చేపడుతున్నామన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు కేంద్రాల్లో పాడేరు, రంపచోడవరం, చింతూరు కేంద్రాల్లో చేపడుతున్నామని చెప్పారు.ఈ దీక్ష కు జిల్లా నలుమూల నుండి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎస్.కన్నయ్య, మండల సహా అధ్యక్షులు ఎస్.బాలకృష్ణ, మండల కార్యదర్శి ఆనంద్ కిల్లో, మేఘనాథ్ తుచ్చ, పోరపు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.










