ప్రజాశక్తి-పంగులూరు: కార్మికులంతా ఐక్యమై సంఘటితంగా పోరు సల్పితే సమస్యలు పరిష్కారం అవుతాయని, సిఐటియు బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి ఎం రామాంజనేయులు అన్నారు. సిఐటియు పంగులూరు మండల మహాసభ ఆదివారం పంగులూరులో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రామాంజనేయులు మాట్లాడుతూ, సమస్యలతో సతమతమయ్యే కార్మికులంతా ఐక్యం కావాలని కోరారు. గ్రామాల్లో ఉండే అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అందరూ ఐక్యమై పనిచేయాలని అన్నారు. కార్మికులు ఐక్యం కాకుండా ఉండేందుకు, వారి పోరాటాలను విచ్ఛిన్నం చేసేందుకు పాలక పక్షాలు ప్రయత్నం చేస్తాయని, వాటిని తిప్పికొట్టి కార్మికులంతా ఐక్యం కావాలన్నారు. పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే, గ్రామాలు మొత్తం ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేనని, అధికారులు కార్మిక హక్కులను కాలరాయకుండా, వారి హక్కులను కాపాడాలని అన్నారు. పంగులూరు మండలంలో కార్మికులకు అండగా ప్రజా సంఘాలు ఉన్నాయని, సిఐటియును బలపరుచుకుని ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని రామాంజనేయులు కోరారు. ఈ సభకు పంచాయతీ కార్మికుడు నూతలపాటి బాబురావు అధ్యక్షత వహించగా, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాయిని వినోద్ బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు తదితరులు మాట్లాడారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
మహాసభ సందర్భంగా పంగులూరు మండల పంచాయతీ కార్మికుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా గుడిపాటి మల్లారెడ్డి, అధ్యక్షులుగా సంపెంగల వెంకటరావు, కార్యదర్శిగా నూతల పాటి బాబురావు, సభ్యులుగా దేవరకొండ శ్రీను, పాలపర్తి ఏడుకొండలు, సందిపోగు ఇర్మియా, కట్టా ఇర్మియా, నూతలపాటి డొనేష్, పాటిబండ్ల మత్తయ్య, మట్టకొయ్య సుబ్బారావు, వలేరు సుబ్బయ్యలను ఎన్నుకున్నారు.










