ప్రజాశక్తి-చీరాల: సంఘటిత పోరాటాలతో కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆ దిశగా పోరాటాలు కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర నాయకురాలు కె ధనలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర నాయకురాలు కే ధనలక్ష్మి హాజరై మాట్లాడారు. సమావేశం ముందుగా సాయుధ రైతాంగ పోరాటయోధుడు, కార్మిక ఉద్యమ నిర్మాత, ఆదర్శనేత, అమరజీవి కామ్రేడ్ పర్స సత్యనారాయణ 8వ వర్థంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో కామ్రేడ్ పర్స సత్యనారాయణ కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారన్నారు. అసెంబ్లీలో కార్మిక సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. ఆయన చూపిన మార్గంలో రాష్ట్రంలో కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ పలు అంశాల గురించి వివరించారు. సిఐటియు రాష్ట్ర నాయకురాలు కె ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతూ బిజెపి మతతత్వ విధానాలపై కార్మికుల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎం వసంతరావు, తిరుమలరెడ్డి, ప్రతాప్ కుమార్, కే శ్రీనివాసరావు, రేఖ ఎలిజిబెత్, ధనలక్ష్మి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.










