Aug 27,2020 08:15

సంఘపరివారం జొర‌బడడానికే ఎన్‌ఇపి
అంగన్‌వాడీల ద్వారా దేశవ్యాప్తంగా చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే పథకాన్ని విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా చేస్తోంది నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి). ప్రాథమిక విద్య లోని మొదటి రెండు తరగతులనూ ప్రీ స్కూలు దశతో కలిపి 'ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఇసిసిఇ) ప్రోగ్రాం' గా ముందుకు తెచ్చింది. ఈ ప్రోగ్రాం తోబాటు 12వ తరగతి స్థాయి వరకూ ఉపాధ్యాయులే కాకుండా 'శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తలు' విద్యా బోధనలో భాగస్వాములు అవుతారని ప్రకటించింది. ఎవరీ సామాజిక కార్యకర్తలు? వారికుండే అర్హతలేమిటి? వారినెవరు ఎంపిక చేస్తారు?
ఈ ఎన్‌ఇపి ని ప్రకటించాక ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగానే స్వాగతిస్తూ తాము కోరిన అన్ని మార్పులనూ ఈ ఎన్‌ఇపి లో చేర్చారని ప్రశంసించింది. విద్యా వ్యవస్థ ద్వారా చిన్ననాటి నుండే నైతిక, ధార్మిక విలువల పేరిట హిందూత్వ భావజాలాన్ని జప్పించాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం. ఇప్పుడు ప్రాథమిక విద్య నుండి మొదటి రెండు తరగతులను విడదీసి వాటిని ప్రీస్కూలు దశతో కలగలిపి...ఆ దశలో వారిని ప్రభావితం చేసేందుకు సామాజిక, స్వచ్ఛంద కార్యకర్తల పేరుతో...ఆర్‌ఎస్‌ఎస్‌ క్యాడర్‌ను రంగం లోకి దింపాలనుకుంటున్నది.
 భాషలు - బోధనా మాధ్యమం
జ్యోతిబా ఫూలే మొదలు, గాంధీ, టాగూర్‌ వంటి వారంతా మాతృభాషలో విద్యా బోధన ప్రాధాన్యత గురించి చెప్పారు. ఇంగ్లీషు మీడియంలో చదివితే ఇంగ్లీషు బాగా మాట్లాడడం వచ్చేస్తుంది అన్న అభిప్రాయం పూర్తిగా నిరాధారం అని 2017లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ నిర్వహించిన ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. నిజానికి తొలి దశ నుండీ ఇంగ్లీషు మీడియంలో చదవడం వలన ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పిల్లలకు విషయాలను గ్రహించగల శక్తి బాగా దెబ్బ తిందని ఆ అధ్యయనం తెలిపింది.
ఎన్‌ఇపి మాతృభాషలో విద్యా బోధన ప్రాధాన్యత గురించి స్పష్టంగా చెప్పకపోగా దానిని గందరగోళ పరిచింది. అంతేకాక అదనంగా ఒక ప్రాచీన భాషను (అంటే సంస్కృతం అని పాలకుల మనోభావం) ఉన్నత విద్య దశతో సహా అన్ని స్థాయిలలోనూ నేర్చుకోవాలని నిర్దేశించింది. సంస్కృతానికి పెద్దపీట వేసి ఇతర ప్రాచీన భాషలైన తమిళం, పాళీ, పర్షియన్‌ భాషలను చిన్న చూపు చూసింది. ఇది విద్యను బ్రాహ్మణీకరణ చేస్తుంది. 85 శాతం పిల్లలను చదువుకు దూరంగా నెడుతుంది. ఇతర దేశాల భాషలను సైతం నేర్చుకోవాలని చెప్పి ఫ్రెంచి, జపనీస్‌, కొరియన్‌, థారు, మలయా వంటి భాషలను ప్రస్తావించిన ఎన్‌ఇపి ఈ దేశంలో పుట్టిన భాష ఉర్దూను, పొరుగు దేశం చైనా ప్రజలు మాట్లాడే మండారిన్‌ భాషను పక్కనబెట్టింది. కనుక ఉద్దేశం స్పష్టమే.
ఉన్నత విద్య
ఉన్నత విద్యా రంగానికి సంబంధించి ఎన్‌ఇపి ప్రతిపాదనలు ఎటువంటి పర్యవసానాలకు దారితీయనున్నాయి? 1. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు, రాష్ట్రాలు నిర్వహించే యూనివర్సిటీలకు నిధులు లేక అవి మూతబడతాయి. 2. సేవా దృక్పథం గల సంస్థలు అన్న పేరుతో ప్రైవేటు సంస్థలకు క్రమంగా ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ పబ్లిక్‌-ఫిలాంత్రపిక్‌-పార్టనర్‌షిప్‌ (పి.పి.పి) పద్ధతిలో ప్రైవేటీకరిస్తారు. 3. ఫీజులు పెంచివేయడం, రిజర్వేషన్లను క్రమంగా నీరుగార్చి, ఉపకార వేతనాలను మెరిట్‌ పేరుతో దళిత, గిరిజన, బలహీన వర్గాల విద్యార్థులకు కాకుండా ఆధిపత్య కులాల వారికే ఎక్కువగా అందించి మొత్తంమీద సామాజిక న్యాయం లేకుండా చేస్తారు. 4. శాస్త్రీయ దృక్పధం, విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత వంటి అవశ్య ధోరణులను పెంపొందించే బదులు తక్కువ వేతనాలకే పని చేసే కార్మికులను తయారు చేయడానికి వొకేషనల్‌ కోర్సుల పేర వృత్తి విద్యలను నేర్పుతారు. విజ్ఞానానికి, నైపుణ్యానికి గల తేడాను చెరిపేసి కలగాపులగం చేస్తారు. 5. ఉన్నత విద్యా సంస్థలలో విస్తృతంగా ఎక్కడికక్కడ జరగాల్సిన పరిశోధనలను కేంద్రీకృత వ్యవస్థ అదుపులోకి తెచ్చి రిసెర్చికి కీలకంగా అవసరమైన చొరవను, ఉత్సాహాన్ని దూరం చేస్తారు. 6. ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించి ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు మధ్య, విద్యార్థులలో ఒకరికి ఒకరికి మధ్య ఉండవలసిన సజీవ సంబంధాన్ని తుంచివేస్తారు. విద్యా వ్యవస్థను రాజకీయ రహితంగా దిగజారుస్తారు.
విదేశీ విశ్వవిద్యాలయాలకు పెద్దపీట
యునెస్కో 2000 సంవత్సరంలో ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు పేద, వెనుకబడిన దేశాలలోని విద్యార్ధులకు అందిస్తున్న కోర్సులన్నీ నాసిరకంగా ఉంటున్నాయి. తమ పేరు ప్రతిష్టలను అడ్డం పెట్టుకుని నాణ్యతలేని చదువులను అంటకట్టడం జరుగుతోంది. కాని ఈ సత్యం మన పాలకులకు కనిపించదు. ఇక్కడ ఆ విదేశీ యూనివర్సిటీలకు ప్రవేశం కల్పించినంత మాత్రాన 100-150 సంవత్సరాల కాలంలో అవి అక్కడ సాధించిన స్థాయినంతటినీ వెనువెంటనే ఇక్కడ మనకు బదిలీ చేసేస్తాయనుకోవడం తెలివితక్కువతనమే. దానికి బదులు మనమే స్వతంత్రం వచ్చిన తర్వాత కాలంలో ఇప్పటిదాకా సాధించిన పురోగతిని, అంతర్జాతీయంగా మనకు గుర్తింపు తెచ్చిన మన ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేసుకుని ముందుకు పోవాలి. కాని ఎన్‌ఇపి విదేశీ సంస్థలకే ప్రాధాన్యతనిస్తోంది.
ఇతర సమస్యాత్మక అంశాలు
1. కామన్‌ స్కూల్‌ పద్ధతి లేదా నైబర్‌హుడ్‌ స్కూల్‌ పద్ధతిని చాలా కాలంగా కోరుతున్నాం. ఎన్‌ఇపి దానిని పూర్తిగా పక్కనబెట్టింది (కామన్‌స్కూల్‌ లో ఒక ప్రాంతంలో నివసించే పిల్లలంతా ఆర్థిక, సామాజిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఒకే చోట ఒకే చదువు నేర్చుకుంటారు.). 2. వివక్షతతో కూడిన బహుళ దొంతరల విద్యా వ్యవస్థను విడిచి పెట్టడం పోయి కొనసాగించనున్నారు. 3. అధ్యాపకులలో, ఉపాధ్యాయులలో ఉన్న అడ్‌హక్‌, కాంట్రాక్టు పద్ధతులను నిలుపు చేస్తామని గాని, ఉపాధ్యాయులను జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల విధులు వంటి పనుల్లో నియోగించబోమని గాని ఎన్‌ఇపి లో ఎక్కడా చెప్పలేదు. 3. 3వ ఏటనుంచి 18వ ఏడు దాకా పాఠశాల చదువు పరిధిని విస్తరించామని చెప్పుకుంటున్నారే తప్ప 'విద్యా హక్కు చట్టం'లో ఆ మేరకు ఏటువంటి సవరణనూ ప్రతిపాదించలేదు. 4. విద్యను ఒక సరుకుగా పరిగణించకుండా, విద్యా వ్యాపారానికి అనుమతించకుండా నిషేధం విధించే ప్రతిపాదన ఏదీ లేదు. 5. మన విద్యా విధానంలో ప్రపంచబ్యాంకు జోక్యానికి వ్యతిరేకంగా ఎటువంటి వైఖరినీ ప్రకటించలేదు.
మొత్తంగా చూస్తే నయా ఉదారవాద విధానాలు హిందూత్వ శక్తుల భుజాలమీదకెక్కి మన భారత దేశపు సహజ, మానవ వనరులను కొల్లగొట్టడానికి తయారవుతున్నాయని నిర్ధారించవచ్చు. ఎప్పటికన్నా కూడా ఇప్పుడే మనకు అంబేద్కర్‌, గాంధీ, షహీద్‌ భగత్‌ సింగ్‌ ఎక్కువ అవసరం అనిపిస్తోంది.
- అనిల్‌ సద్గోపాల్‌
( వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌ మాజీ డీన్‌, జాతీయ విద్యా హక్కు వేదిక వ్యవస్థాపక సభ్యులు )