Nov 21,2023 00:10

కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన సంఘమిత్రలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
సోమల మండలం పెద్దవుప్పరపల్లి పంచాయతీ కమ్మపల్లి-3 సంఘమిత్రను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్న ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్పందనలో సంఘసభ్యులు కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘమిత్ర యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, బాధిత సంఘమిత్ర మమతలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 16 సంఘాల సభ్యులు 160మంది సంఘమిత్ర మమత ఉండాలని తీర్మానం చేసినప్పటికీ ఏపిఎం వారి మనిషిని పెట్టుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే వివో మినిట్స్‌లో తీర్మానం లేకుండా కొత్త సంఘమిత్ర నియమించడం దారుణమని విమర్శించారు. డిఆర్డిఏ నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్‌ చేశారు. ఇప్పటికే సంఘమిత్రను రకరకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి కారణమైన ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని గతంలో కూడా కలెక్టరుకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ సందర్భంగా డిఆర్డిఏ ఐబి వెంకటేశ్వర్లు వెళ్లి గ్రామంలో సమావేశం జరిపి సందర్భంగా కూడా సంఘ సభ్యులు అందరూ కూడా మమత ఉండాలని తీర్మానం చేయడం జరిగిదని, ఆ తీర్మానం ప్రకారం ఏపీఎం వ్యవహరించడం లేదని, గత ఆరు నెలలుగా పనిచేసిన రోజులకు కూడా జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరితో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఏపీఎం వివోలో తీర్మానం లేకుండా కొత్త వారికి ఎలా అవకాశం ఇస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి వివో తీర్మానం ప్రకారం సంఘమిత్రను మమతను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.