Sep 12,2023 17:39

విలేకర్లతో మాట్లాడుతున్న పత్తిపాటి పుల్లారావు

ప్రజాశక్తి - చిలకలూరిపేట : చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన ఘటన తనతోపాటు టిడిపికి చెందిన 80 మందిపై పోలీసులు 3 రకాల కేసులు నమోదు చేశారని, చంద్రబాబుకు మద్దతు తెలపడం కూడా తప్పేనా? అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ మేరకు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబును నంద్యాల నుండి విజయవాడకు తరలిస్తుండగా ఆయనకు సంఘీభావం తెలపడానికి టిడిపి శ్రేణులు పట్టణంలోని ఎన్‌ఆర్‌టి సెంటర్‌కు భారీగా తరలివచ్చారని, అయితే కాన్వారును అడ్డుకున్నామని, విధులకు తీవ్ర ఆటంకం కలిగించామని, జాతీయ రహదారిపై గుమ్మిగూడి రాకపోకలకు అంతరాయం కల్పించామనే ఫిర్యాదుతో పోలీసులు తమపై కేసులు పెట్టారని చెప్పారు. పోలీస్‌ వాహనంపై పెట్రోలు పోసి తగులబెట్టపోయారని, ఇదంతా పుల్లారావు ఆదేశాల మేరకే చేశారంటూ ఎస్‌ఐ పి.మాచర్ల ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. ఎస్‌ఐ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు 57 మందిపైన, నాదెండ్ల మండలం గిరిజవోలుకు చెందిన బి.జవహర్‌బాబు ఫిర్యాదుతో టిడిపికి చెందిన 9 మందిపైనా కేసులు నమోదు చేశారని వివరించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.