Dec 31,2022 00:03

దీక్షలో కూర్చున్న ప్రజా సంఘాల నేతలు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన విద్యార్థుల మరణాలపై అధికారులు తక్షణమే గిరిజన ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, మరణాలకు డబ్బుతో వెలగట్టే సాంప్రదాయం మానుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కూడ రాధాకృష్ణ, ఐక్య వేదిక కో కన్వీనర్‌ ప్రభుదాస్‌ డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ వద్ద ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 12వ రోజు కొనసాగాయి. ఈ రిలే దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, రెండు నెలల వ్యవధిలో ఆరుగురు విద్యార్థులు మరణించారని, గిరిజన విద్యార్థుల ప్రాణాలు గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఆరుగురు మంది విద్యార్థులు చనిపోయినా అధికారులకు, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, మరణించిన ఆ కుటుంబాలకు డబ్బులతో వెలగట్టే కొత్త సాంప్రదాయాన్ని ఐటీడీఏ అధికారులు తీసుకొచ్చారన్నారు.గిరిజన విద్యార్థుల ప్రాణాలు అంటే చులకన భావంతో అధికారులు వ్యవహరిస్తున్నారని, మరణాల నివారణకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని, డిమాండ్‌ చేశారు. పాడేరు ఐటీడీఏ పిఓను తక్షణమే సరెండర్‌ చేయాలని, పెదబయలు తహసీల్దార్‌ ఆత్మహత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సెట్టింగ్‌ జడ్జితో విచారణ నిర్వహించాలని, గిరిజన విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్‌ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశార. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక కో కన్వీనర్లు మువ్వాళ లక్ష్మణరావు, చిన్నారావు, కాదేలి చంటిబాబు, బత్తిరి నరేష్‌, పి.లోకేష్‌, తిరుపతిరావు గిరిజన సంఘం నాయకులు బొజ్జన్న పాల్గొన్నారు.