Jan 01,2023 17:35

ప్రజాశక్తి - ఉంగుటూరు
            పెద్దలు వేసిన పునాదిని కాపాడుకుంటూ వాళ్లు నిర్మించిన బాటలో పయనిద్దామని కార్పెంటర్స్‌ యూనియన్‌ మండల ప్రధాన కార్యదర్శి అనుపోజు వీరవెంకటబ్రహ్మం అన్నారు. సంఘాలను బలోపేతం చేసుకోవడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నడుం బిగించాలని కోరారు. స్థానిక పంచాయతీ కమ్యూనిటీ హాల్‌ భవనంలో ఆ సంఘం మండల విస్తృతస్థాయి సమావేశం సంఘం మండల అధ్యక్షులు రౌతు సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మం మాట్లాడుతూ మన పూర్వీకులు నిర్మించిన సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటితరంపై ఉందన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సంక్షేమ బోర్డును సాధించుకున్నట్లు చెప్పారు. పాలకవర్గాలు కార్మికుల పొట్టలపై కొట్టడం అత్యంత బాధాకరమన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే ఈ దాడిని తిప్పికొట్టగలమన్నారు. సంఘాలను బలోపేతం చేసుకోవడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నడుం బిగించాలని కోరారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి కె.వెంకట్రావు మాట్లాడుతూ నిత్యం కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభ ఈ నెల 2, 3, 4 తేదీల్లో భీమవరంలో జరుగుతుందని, ఈ మహాసభ జయప్రదం కోసం ప్రారంభ సూచికగా జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆ సంఘానికి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన సీనియర్లు రౌతు సత్యనారాయణ, మరడాని సోమాచారి, వానపల్లి వీర్రాజు, మారేడుపూడి రామాచార్యులు, కొక్కొండ సత్యనారాయణ, సింగవరపు నాగేశ్వరరావు, చింతలపూడి రత్నచారి, దార్ల మాస్రమ్మ, కొత్తలంక శేషారావు, కౌలూరి అప్పారావులకు సన్మానం చేశారు.