ప్రజాశక్తి - సీలేరు
గిరిజన యువత సంఘ విద్రోహశక్తులకు దూరంగా ఉండాలని చింతపల్లి ఏఎస్‌పి కొమ్ము ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు. జీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ పరిధి వలస గడ్డ, బుసు కొండ, పార్వతి నగర్ గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలై జీవితాల్ని బుగ్గిపాల చేసుకోవద్దని హితవుపలికారు. గంజాయి, నాటు సారా వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ ప్రేరణ ద్వారా కల్పిస్తున్నఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గిరిజనులకు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు గిరిజనులు ఆయన దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జికె.వీధి సిఐ అశోక్ కుమార్, స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










