
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అమూల్ పాల డెయిరీని ప్రోత్సహించి మిగతా డెయిరీలను నిర్వీర్యం చేయడానికి వైసిపి ప్రభుత్వం యత్నిస్తోందని సంగం డెయిరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. స్థానిక అమరావతి రోడ్డులో ఒక ఫంక్షన్ హాలులో సంగం డెయిరి నూతన ఉత్పత్తులను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమూల్ వల్ల ఇతర డెయిరీలన్ని ఇబ్బందులు పడుతున్నాయని, అమూల్‌కు ప్రభుత్వం భూములిచ్చి, భవనాలు కట్టింస్తోందని, అయితే ఇతర డెయిరీలకు ఎటువంటి ప్రోత్సహం లేదని అన్నారు. ఒక్కో ప్రాంతంలో రూ.కోటి వరకు ఖర్చు పెట్టి అమూల్‌కు నిర్మాణాలు చేస్తున్న ప్రభుత్వం ఎప్పటి నుంచో రైతులకు సేవలందిస్తున్న సంగం డెయిరీకి మద్దతేమీ ఇవ్వడం లేదని విమర్శించారు.
ఇదిలా ఉండగా పాలను మాత్రమే విక్రయించే చిరు వ్యాపారులకు తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు నూతనంగా సంగం డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. మొత్తం పదమూడు రకాల నూతన బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్‌ను నరేంద్ర కుమార్, పాలకవర్గ సభ్యులు విడుదల చేశారు. సంగం డెయిరి పాలను, పాల పదార్థాలలో నాణ్యత కోసం వివిధ దశలలో 114 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, 8 వేలకు పైగా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్ల ద్వారా 82 రకాల పాలు, పాల ఉత్పత్తులను 160 వివిధ పరిమాణాల్లో లక్షలాది గృహాలకు సరఫరా చేస్తున్నామని నరేంద్ర చెప్పారు. రాష్ట్రంలో 6720 గ్రామాల్లో విస్తరించి 1,50,000 మంది పాడి రైతుల నుండి సంఘం డెయిరీ రోజువారి ప్రాతిపదికన దినసరి 7,80,000 లీటర్ల పాలను సంగం డెయిరి సేకరిస్తున్నామన్నారు. సాంకేతికంగా అధునాతన ప్లాంట్లలో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని తెలిపారు. సంగం డెయిరిలో అత్యాధునిక టెక్నాలజీతో యాంత్రీకరణ ద్వారా ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. పాడి రైతులకు తగిన ప్రోత్సహాకాలు ఇస్తున్నామని, తమకు ఉత్పత్తిదారులు, వినియోగదారులు రెండు కళ్లని అన్నారు. పంపిణీ దారులు ఏజెంట్ల ఆదాయాలను పెంచడం కోసమే వివిధ రకాల కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంగం డెయిరీ మేనేజింగ్ డైరక్టర్ గోపాలకృష్ణ, డైరెక్టర్లు, డిస్టిబ్యూటర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు.