Nov 13,2022 23:31

మరమ్మతులకు గురైన పెద్దేరు వంతెన పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌ఫొటో)

న పెద్దేరు వంతెన మరమ్మతులకు గురికావడంతో వాహనాల రాకపోకలు నిలుపుదల
న ఆరు కాటా పరిధిలోని చెరకు రైతుల్లో ఆందోళన
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట

మండలంలోని వడ్డాది వద్ద పెద్దేరు వంతెన మరమ్మతులకు గురికావడంతో వంతెనకు ఇవతల ఉన్న 6 చెరకు కాటాల పరిధిలోని చెరకు రవాణా పరిస్థితి సందిగ్ధంలో పడింది. గోవాడ చక్కెర కర్మాగారానికి ఫ్యాక్టరీ పరిధిలోని పలు చెరకు కాటాల నుండి చెరకు రవాణా అవుతుంది. ఐదు నెలల క్రితం వరద తాకిడికి పెద్దేరు వంతెన రెండు ఖానాల వద్ద స్లాబ్‌ కుంగిపోయింది. దీంతో రాళ్లతో తాత్కాలిక మరమ్మతులు చేసి ద్విచక్ర వాహనాలు, కారులు, ఆటోలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ వంతెన పైనుండి బస్సులు, లారీలు వంటి భారీ వాహనాల రాకపోకలు నిలుపుదల చేశారు. నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు మరమ్మతు చేపట్టిన ప్రాంతంలో రోడ్డు జారిపోవడంతో ప్రస్తుతం పాదచారులు, ద్విచక్ర వాహనదారులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు.
జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో రైతులు అధికంగా చెరకు సాగు చేపడుతున్నారు. దీనిని గోవాడ చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తుంటారు. కొద్ది మంది రైతులు మాత్రమే బెల్లం క్రషర్ల వద్ద బెల్లం తయారు చేస్తుంటారు. పెద్దేరు వంతెనకు ఇటువైపున ఉన్న బుచ్చయ్యపేట, తట్టబంద, జి.నాయుడుపాలెం, రోలుగుంట, రావికమతం, చిన్నపాచీల చెరకు కాటాల ద్వారా సుమారు 70వేల నుండి 80 వేల టన్నుల చెరకు గోవాడ ఫ్యాక్టరీకి సరఫరా కావలసి ఉంది. పెద్దేరు వంతెన పైనుండి చెరకు రవాణా అయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడంలేదు. దీంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయం అంతంత మాత్రమే..
పైకాటాల నుండి సరఫరా అయ్యే చెరకు ఫ్యాక్టరీకి రవాణా చేయాలంటే సరైన ప్రత్యామ్నాయ రోడ్లు సైతం లేవు. రావికమతం, బుచ్చయ్యపేట, పిఎస్‌.పేట మీదుగా ఫ్యాక్టరీకి చెరకు తరలించాలంటే ఇది సింగల్‌ రోడ్డు. పైగా మలుపులు ఎక్కువ. పూర్తి శిథిలావస్థలో ఉంది. రోడ్లు మధ్యలో పెద్ద పెద్ద గొయ్యలు పడ్డాయి. ఈ మార్గంలో చెరకు రవాణా చేస్తే లారీలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కింతలి మీదుగా వడ్డాది చేరుకోవాలంటే అదనంగా 15 కిలోమీటర్లు దూరం పెరగనుంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది ఫ్యాక్టరీకి చెరకు సరఫరా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. గోవాడ చక్కెర కర్మాగారం ఎమ్‌డి వడ్డాది వంతెనను పరిశీలించి మరమ్మతులు చేపడతామని తెలిపారు. మరమ్మతులు జరగడం ఎప్పుడు, చెరకు రవాణా అయ్యేది ఎప్పుడు అంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. వంతెనకు మరమ్మతులు చేస్తారో? లేదంటే దూరభారమైనా ప్రత్యామ్నాయ మార్గంలో చెరకు రవాణా చేస్తారో లేదో వేచి చూడాలి.
ఫ్యాక్టరీకి చెరకును ఎలా సరఫరా చేయాలి
నేను గోవాడ చక్కెర ఫ్యాక్టరీకి 30 టన్నులపైగా చెరకు సరఫరా చేస్తుంటాను. ప్రస్తుతం చెరకు పక్వానికి వచ్చి సరఫరాకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ మొదటి వారంలో ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమవుతుంది. 20 రోజులు సమయం కూడా లేదు. వంతెన మరమ్మతుల వలన కాటాలను ప్రారంభించే పరిస్థితులు కానరాలేదు. పండించిన చెరకును ఫ్యాక్టరీకి సరఫరా ఎలా చేయాలో అర్థం కావడం లేదు.
- సుంకర సూరిబాబు, రైతు ,బుచ్చయ్యపేట.