
ప్రజాశక్తి-అనకాపల్లి
స్థానిక జార్జి క్లబ్ వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, ఆది లీల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జార్జి క్లబ్ కొణతాల వెంకటనారాయణమ్మ కళా ప్రాంగణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ప్రదర్శనలో గుంటూరు అమృత లహరి థియేటర్ ఆర్ట్స్ సౌజన్యంతో 'నాన్నా నేనొచ్చేస్తా', చిలకలూరిపేట ది అమ్మెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ వారి 'ఆలీతో సరదాగా' నాటికలను ప్రదర్శించారు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరణలో అమృత లహరి దర్శకత్వంలో ప్రదర్శించిన 'నాన్నా నేనొచ్చేస్తా' నాటిక సంక్షిప్త కథను పరిశీలిస్తే... నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు నుంచి పెళ్లి వరకు వారికి కావలసింది సమకూరుస్తున్నారు. మితిమీరిన మమకారంతో పెంచిన ఫలితంగా పెళ్లయిన కొంతకాలానికే వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్ధలను పరిష్కరించుకోలేకపోతున్నారు. పెళ్లంటే సర్దుబాటు, సంసారం అంటే దిద్దుబాటు అన్న సూత్రాన్ని విస్మరించి మెట్టింటి నుంచి పుట్టింటికి వస్తున్నారు. సుధ లాంటి అమ్మాయికి, భర్త శ్రీరామ్‌కి, తల్లిదండ్రులు సావిత్రి రాఘవ మధ్య జరిగిన సంఘర్షణల దృశ్య రూపమే ఈ నాటిక. రెండోనాటికగా ప్రదర్శించిన ఆలీతో సరదాగా ఇతివృత్తాన్ని పరిశీలిస్తే... ప్రపంచీకరణ నేపథ్యంలో పెరిగిన సాంకేతిక విజ్ఞానంతో నేటి తరం ఉన్నత ఉద్యోగాలతో పాటు అధిక ఆదాయం సంపాదిస్తోంది. ఆదాయం అవసరాలకు మించి ఉండడంతో వారి బుద్ధి వెర్రి తలలు వేస్తోంది. కొత్త కొత్త సరదాలు పలు అనర్ధాలకు దారితీస్తుంది. ఈ నిజాన్ని హాస్యంతో మేళవించి నేటి యువత విజ్ఞతతో వ్యవహరించాలని తెలియజేప్పేదే ఆలీతో సరదాగా నాటిక. ఈ నాటిక ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఒక సందేశాన్ని ఇచ్చింది. కార్యక్రమంలో జార్జి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బుద్ధ కాశి విశ్వేశ్వరరావు, మళ్ల చంద్రశేఖర్, ఆళ్ల వెంకట నూకేశ్వరరావు కళాపరిషత్ నిర్వాహకులు బొప్పన నరసింహారావు, జి.మల్లికార్జునరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు, ఎస్ ఆదినారాయణ, నాటిక పోటీల కన్వీనర్ కేఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.