Jul 20,2022 23:25

వెటర్నరీ జెడి డాక్టర్‌ రామకృష్ణ

వెటర్నరీ జెడి డాక్టర్‌ రామకృష్ణ
ప్రజాశక్తి - ఆరిలోవ         
డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవ వాహన సేవలను పశు పోషకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధకశాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామకృష్ణ అన్నారు. బుధవారం పాత డెయిరీ ఫారంలోని వెటర్నరీ డీడీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, సంచార పశు ఆరోగ్య సేవల వివరాలు వెల్లడించారు. పశు పోషణ జీవనాధారంగా ఉన్న పాడిరైతులకు సంచార వాహనసేవలు, సకాలంలో వారి ఇంటివద్దకే చేరుకుని అందిస్తాయని, తద్వారా పశువుల ప్రాణనష్టం నివారించే చర్యలతోపాటు రైతులకు వ్యయప్రయాసలు లేకుండా చేస్తాయన్నారు.సంచార పశు వైద్య సేవల కోసం పశు సంవర్ధక శాఖ టోల్‌ ఫ్రీ నెంబరు 1962ను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు సంచార వెటర్నరీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరిన్ని వాహనాలు రానున్నాయన్నారు. సంచార వాహనంలోనే పశువులకు ప్రథమ చికిత్సతోపాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌, చిన్నపాటి ఆపరేషన్లు, కృత్రిమ గర్భధారణ ఇంజిక్షన్లు వంటి సేవలు అందిస్తారన్నారు. సంచార వాహనంలో ఒక వెటర్నరీ డాక్టర్‌తోపాటు ల్యాబ్‌ టెక్నిషియన్‌ కమ్‌ కాంపౌండర్‌, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ అందుబాటులో ఉంటారన్నారు. సంచార వాహనంలో వైద్యానికి వీలుపడని చికిత్సలు, ఆపరేషన్ల కోసం సమీప పశు వైద్య కేంద్రాలకు మూగజీవాలను తరలించి, అక్కడ నిపుణులైన పశు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం రైతు ఇంటికి చేరవేస్తారన్నారు.
విశాఖ జిల్లాలో సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు ద్వారా ఇప్పటివరకు 96 గ్రామాల్లో 722 పశువులకు చికిత్స అందించగా, అత్యవస సేవల ద్వారా 690 పాడి పశువులను కాపాడినట్టు తెలిపారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కరుణాకరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ లీలారాణి పాల్గొన్నారు.