ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 6వ వార్డు పరిధి పిఎం.పాలెం సమీపంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన శంభువానిపాలేనికి ఎన్నో ఏళ్ల తరువాత మొట్ట మొదటి సారిగా ఆర్‌టిసి బస్సును వేశారు. ఆదివారం ఉదయం శంభువానిపాలెంలో ఆర్‌టిసి బస్సుకు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేద ప్రజలు సమస్యలు తెలుసుకోగలుగుతున్నామని, అందులో భాగంగానే శంభువానిపాలెం ప్రాంతంలోని గిరిజనులు రవాణా సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. దీంతో ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కనీసం బస్సు సౌకర్యం లేని వీరికి ఈ సౌకర్యం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. గిరిజనులమనే గుర్తింపు పత్రాలు లేవని, అత్యవసర వేళల్లో కనీసం అంబులెన్స్ సర్వీస్ కూడా లేని పరిస్థితులలో తాము నివసిస్తున్నామని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. నగరంలోనే ఉంటున్నా ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి శంభువానిపాలెం గిరిజన ప్రాంతానికి అంబులెన్స్ సర్వీస్, ఆర్‌టిసి బస్సు సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ గిరిజన ప్రాంతంలో నివాసముంటున్న వారిలో సగానికి పైగా ప్రజలకు గుర్తింపు పత్రాలను అందజేశామని, మిగతా వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌తో, బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థతో చర్చలు జరిపి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ ఎ.అప్పలరాజు, మద్దిలపాలెం డిపో మేనేజర్ ఎన్.అరుణకుమారి, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్ల సుజాతసత్యనారాయణ, జోన్-2 కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, 6వ వార్డు వైసిపి అధ్యక్షుడు బొట్ట అప్పలరాజు, స్థానిక వైసిపి నేతలు పోతిన ఎల్లాజీ, పోతిన ప్రసాద్, గాదె రోసిరెడ్డి, గుంటుబోయిన సంజీవ్ యాదవ్, సియ్యద్రి కనకరాజు, ముందుండి రాజేశ్వరి, మోజ్జాడ రమణమూర్తి, పోతిన సూరిబాబు, కురిటి వెంకట లోహిత్, తదితరులు పాల్గొన్నారు.










