Nov 19,2023 22:16

గుడికట్ల కార్యక్రమంలో పాల్గొని కురుబ కులస్తులకు అభివాదం చేస్తున్న నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : కురబలకు సంబంధించిన గుడికట్ల ఉత్సవాలు ఆదివారం నాడు అనంతపురం నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. 800 సంవత్సరాల తరువాత ఈ ఉత్సవాన్ని ఇంత పెద్దఎత్తున నిర్వహించినట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. అనంతపురం నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉత్సవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 252 గుడికట్లు ట్రాక్టర్లపై ఉరేగిస్తూ తీసుకొచ్చారు. బళ్లారి బైపాస్‌ నుంచి జూనియర్‌ కళాశాల వరకు ట్రాక్టర్లలో వీటిని తీసుకొచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలోని టవర్‌ క్లాక్‌, సప్తగిరి శ్రీకంఠం సర్కిళ్లు, కళ్యాణదుర్గం రోడ్డు, జెఎన్‌టియు, ఎస్‌కెయు రోడ్డు పలు ప్రాంతాల్లో కురబలు భారీ ర్యాలీలు ఊరేగింపులు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ కురుబల ప్రదర్శనలతో నిండిపోయాయి. ఈ సమయంలో పెద్దఎత్తున ట్రాఫిక్‌ సమస్యలు నెలకొన్నాయి. టవర్‌క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌, శ్రీకంఠం సర్కిల్‌, జూనియర్‌ కళాశాల మైదానం వరకు భీరప్ప స్వాములను ఊరేగించారు. అన్ని స్వాములను ఒకచోట ఉంచి పూజలు నిర్వహించారు. 250 గుడికట్లకు హెలీక్యాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు. లహరి డ్యాన్స్‌ అకాడమీ, మక్బూల్‌ అకాడమీల ఆధ్వర్యంలో చిన్నారులు, యువత సాంప్రదాయ, జానపద, వెస్టర్న్‌ నృత్యాలతో అలరించారు. గొరవయ్యల విన్యాసాలు, ఉరుములు, డ్రమ్స్‌ వాయిద్య విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు రాజహంస శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన సంబరాలకు మంత్రి ఉషాశ్రీచరణ్‌, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, టిడిపి శ్రీసత్యసాయి జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు బికె.పార్థసారథి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ కురుబ యాదవ సాధికార సమితి రాష్ట్ర కోఆర్డినేటర్‌ శివబాలతోప ఆటు పెద్ద ఎత్తున కురుబలు హాజరయ్యారు. కురుబల ఐక్యతను బలపరిచేలా నాయకులు అభివాదాలు చేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం కురుబల ఉనికిని చాటే గుడికట్ల సంబరాలు తిరిగి ప్రజలకు తెలిసేలా కురుబల ఐక్యతను మరింత పటిష్టపరిచేలా ఈ ఉత్సవాలను మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో నిర్వహించటం గర్వకారణంగా ఉందని శ్రీనివాసులు ఉన్నారు. 252 గుడికట్లను కలిపి నగరంలో ఊరేగింపు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం గౌరవాధ్యక్షులు నారాయణ, ట్రెజరర్‌ నాగన్న, కళ్యాణమండపం ప్రతినిధి కొనకొండ్ల, రాజేష్‌, లక్ష్మి, పిడుగు కృష్ణమూర్తి, కురుబ సంఘం నేతలు ఎమ్‌డీ నాగభూషణం గురువు నారాయణస్వామి పాల్గొన్నారు.