Aug 04,2023 00:51

తుళ్లూరులో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న రాజధాని రైతులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యవహారం అయోమయంలో చిక్కుకుంది. రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి గతనెల 24న సిఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతున్నా ప్రభుత్వం హడావుడిగా గతనెల 24న శంకుస్థాపనకు పూనుకుంది. హైకోర్టు తుది తీర్పు వెలువడక ముందే తాము పేదల కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించామని సిఎం జగన్‌, మంత్రులు ఈ సందర్భంగా జరిగిన సభలో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు స్టే ఉత్తర్వులు ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడడం లేదు.
రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలను ఈ ఏడాది మే 26న సిఎం జగన్‌ పంపిణీ చేశారు. అదేరోజు రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి జులై 8న తాను శంకుస్థాపన చేస్తానని సిఎం జగన్‌ స్థలాల పంపిణీ సందర్భంగా వెంకటపాలెంలో జరిగిన సభలో ప్రకటించారు. ఈ మేరకు మే 26 నుంచి జులై మూడో తేదీ వరకు అధికారులు హడావుడి చేశారు. పట్టాల పంపిణీకి ముందే రాజధానిలో ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపగా కేంద్రం అనుమతిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనకు హడావుడి చేసింది. అయితే జులై మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి లేఖ అందింది. స్థలాల పంపిణీపై కోర్టులో కేసులు ఉన్నందున ఇళ్ల నిర్మాణానికి నిధులివ్వలేమని, కోర్టులో కేసులు తేలిన తరువాత ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయితేనే నిధులు ఇవ్వగలమని పేర్కొంది. దీంతో గతనెల 8న జరగాల్సిన శంకుస్థాపనను వాయిదావేశారు.
వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం జరపాలని ప్రయత్నించినా చివరి దశలో వాయిదాపడటాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు ఇళ్లనిర్మాణం తొలుత రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి కేంద్రం నుంచి తరువాత తీసుకోవచ్చునన్న ధీమాతో గతనెల 24న మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సిఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. కోర్టు నుంచి ప్రభుత్వానికే సానుకూల నిర్ణయం వస్తుందని భావించినా పరిస్థితి తారుమారైంది. ఇళ్లనిర్మాణాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
అంతేగాక రాజధానిలోని ఆర్‌-5 జోన్‌లో దాదాపు 70 శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వమే ఇళ్లునిర్మించి ఇవ్వాలని మూడో ఆప్ఫన్‌కు మొగ్గుచూపారు. ప్రభుత్వం నిర్ధేశించిన సొమ్ముకు ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని, పునాదులకే ఎక్కువ ఖర్చు అవుతుందని అందువల్ల ప్రభుత్వమే ఇళ్లనిర్మాణం చేపట్టాలని మూడో అప్షన్‌ వైపు ఆసక్తి కనబర్చారు. దీంతో ప్రభుత్వమే షేర్‌ వాల్‌ టెక్నాలజీతో నిర్మాణాలను గరిష్టంగా ఆరునెలల్లో ఇళ్లను పూర్తిచేస్తామని ప్రకటించింది. మూడు రోజుల్లో కృష్ణాయపాలెంలో మూడు నమానా ఇళ్లనుకట్టి సిఎంకు చూపారు. సిఎం ఈ ఇళ్లను లబ్ధిదారులకు గతనెల 24న పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందని గురటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు భావిస్తుండగా గురువారం హైకోర్టు స్టేఉత్తర్వులతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే హైకోర్టు స్టే ఉత్తర్వులపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఆర్‌-5 జోన్‌లో స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కొన్నేళ్లుగా పోరాడుతున్న రాజధాని రైతుల న్యాయపోరాటానికి హైకోర్టు తాజా స్టే ఉత్తర్వులతో ఊరట లభించినట్టు అయింది. తమ పోరాటం ఫలించిందని వారు గురువారం రాజధాని గ్రామాల్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.