సమయపాలనకు తూట్లు..
ప్రజాశక్తి - ప్యాపిలి
పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అయితే క్షేత్రస్థాయిలో సచివాలయంలో ప్రజలకు సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్యాపిలి పట్టణంలోని కిందిగేరి 1, 4వ సచివాలయాలలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల అవగాహన రాహిత్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విమర్శలకు దారితీస్తుంది. ఉదయం 10.40 గంటలవుతున్నా సిబ్బంది కేవలం ఒక్కరు మాత్రమే హాజరు కాగా మిగతా కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మిగతా సిబ్బంది తహశీల్దార్ ఆఫీస్‌కి ఒకరు, మరొకరు ఎంపీడీవో కార్యాలయానికి, ఫీల్డ్ మీద బయటికి ఒకరు వెళ్లారని చెబుతున్నారు. రిజిస్టర్‌లోనూ సంతకాలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న సచివాలయ సిబ్బందిఫై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సచివాలయాలను తనిఖీ చేసి సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
సచివాలయం