ప్రజాశక్తి -మధురవాడ : వైద్య, ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆదేశించారు. ఆశా డే సందర్భంగా మధురవాడ పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు యుపిహెచ్‌సి వైద్యాధికారులు, ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో మంగళవారం డాక్టర్ పి.జగదీశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, సిబ్బంది ఉదయం 9 గంటలకే విధులకు హాజరై సమయపాలన పాటించాలన్నారు. అన్ని యుపిహెచ్‌ల వైద్యులు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్సీడీ సర్వే, గర్భిణీ (ఎఎన్‌సి) లను గుర్తించి టిటి అందజేయాలని, బర్త్ ప్లానింగ్, హై రిస్క్ గర్భిణీలను గుర్తించి డాక్టర్స్ సలహా నిమిత్తం ఐరన్, ఫోలిక్ మాత్రలు, పోషకాహారం తీసుకునేటట్లు వారిని ప్రోత్సహించాలని సూచించారు. కుటుంబ డాక్టర్ విధానం గురించి వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. అధిక శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని చెప్పారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఉమావతి, మధురవాడ వైద్యాధికారి ప్రశాంతి పాల్గొన్నారు.










