ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : సముద్రంలో ఈతకు వెళ్లి అకస్మాత్తుగా నీటిలో పడి మునిగిపోయే వారిని రక్షించేందుకు గానూ నైపుణ్యం, అర్హత గల లైఫ్ గార్డులు (సముద్ర ఈతగాళ్ల) 38 మందిని నియమించినట్లు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి వెల్లడించారు. బుధవారం జివిఎంసి సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ప్రమాణాలకు అనుగుణంగా తూర్పునౌకాదళం సహాయంతో అన్ని అర్హతలను పరిశీలించిన పిదప 38 మందిని 2022 సంవత్సరానికి గానూ ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరు కాకుండా మరో ఆరుగురిని రిజర్వుగా పెట్టుకున్నట్లు చెప్పారు. విశాఖకు విచ్చేసే విదేశీ, స్వదేశీ పర్యాటకులు, ప్రకృతి ప్రేమికుల రక్షణార్థం తీరం అంతటా వీరు పలు చోట్ల పహారా కాసి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం, అవసరమైన సాయం చేస్తారని తెలిపారు. నైపుణ్యం, ఈతరాని వాళ్లను నియమించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయని, దీంతో నలగురు జివిఎంసి ఎడిసిలను నిర్ధారణ కమిటీగా ఏర్పాటుచేసి అన్ని అర్హతలను పరిశీలించిన పిదప 'లైఫ్ సేవ్ గార్డు'ల ఉద్యోగాల్లో నియమించినట్లు ప్రకటించారు. మొదటి, రెండవ, మూడవ దశలలో సముద్రంలో 195 మంది ఈతగాళ్లకు పోటీలు నిర్వహించి 38 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో 12 మంది పాతవారేనన్నారు. లైఫ్ గార్డుల వద్ద బైనాక్యులర్లు, ట్యూబ్‌లు ఉంటాయని చెప్పారు. ఎవరైనా ఎక్కడైనా విపత్కర పరిస్థితులను సముద్రంలో ఎదుర్కొంటే వీరికి దూరం నుంచైనా కనిపిస్తుందన్నారు. నావికాదళ రూల్స్ అన్నీ వీరికి వర్తిస్తాయని తెలిపారు. రోబో బోట్లను సైతం త్వరలో తీర ప్రాంతంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే విధానం తెస్తామని కమిషనర్ రాజాబాబు వెల్లడించారు. లైఫ్ గార్డులకు నెలకు రూ.18వేలు జీతంగా నిర్ణయించినట్లు తెలిపారు.










