Jun 05,2022 07:30

మనం నివసించే గ్రహాన్ని భూమి అంటాం. బహుశా ఆ పేరు సరిపోదేమో! మన పూర్వీకులు తమ చుట్టూ కనిపించిన నేలను బట్టి దీనికి 'భూమి' అని పేరు పెట్టి ఉంటారు. కానీ భూమి 70 శాతానికి పైగా నీటిలో మునిగి ఉంది. ఆ నీరు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. సముద్రాల్లో 135 కోట్ల క్యూబిక్‌ కిలోమీటర్ల మేర నీరు ఉంది. ఒకవేళ భూమిపైనా, నీటిలోనా ఉన్న భౌగోళిక ఎత్తుపల్లాలను (కొండలు, పర్వతాలు, గుట్టలు, లోయలు) అన్నీ సమంగా చేశామనుకోండి, అప్పుడు అసలు భూమి కనిపించదు. నీరు మొత్తం భూగోళాన్ని 12 వేల అడుగుల లోతున కప్పేస్తుంది. భూమిని మానవాళికి నివాసయోగ్యంగా మార్చే వ్యవస్థలను సముద్రం నడిపిస్తుంది. మన వర్షాలు, తాగునీరు, వాతావరణం, తీరప్రాంతాలు, మన ఆహారం, చివరికి మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్నీ సముద్రాలు అందిస్తాయి.. నియంత్రిస్తాయి. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..

అంతరిక్షం నుండి చూసినప్పుడు మన గ్రహం నీలం రంగులో కనిపించడానికి కారణం ఈ సముద్ర జలాలే. మన సౌర వ్యవస్థలో ద్రవరూపంలో నీటిని కలిగి ఉన్న ఏకైక గ్రహం భూమి. భూమిపై జీవాన్ని సాధ్యం చేసింది సముద్రాలే. జీవం ఉద్భవించింది నీటిలోనే. పావు వంతు భూమిపై మనం జీవిస్తూ ఏదో మొత్తం భూగోళాన్ని ఏలేస్తున్నామని విర్రవీగుతున్నాం. నిజానికి గ్రహంలో ముప్పాతిక వంతు సముద్రాలదీ, వాటిలోని జీవరాశులదీ!
 

సముద్ర పునరుజ్జీవం.. సాముహిక భాగస్వామ్యం..

నీరు, అద్భుతాల నిధి..
నీరు ఆషామాషీ పదార్థం కాదు. దాని లక్షణాలే విలక్షణం, ప్రత్యేకం. ఘన, ద్రవ, వాయు వంటి మూడు రకాల స్థితుల్లో ఉండే ఏకైక పదార్థం నీరే అని చిన్నపుడు చదువుకున్నాం. అసాధారణ రీతిలో అధిక ఉష్ణాన్ని దాచుకోగల సామర్ధ్యం నీటికి ఉంది. అందుకే వేసవిలో వేడిని, చలికాలంలో చలినీ మార్చగల లక్షణం వేడిని దాచుకున్న సముద్రాలకు ఉంది. ఇతర ద్రవ్యాలకు భిన్నంగా, నీరు గడ్డకట్టినప్పుడు వ్యాకోచిస్తుంది. ఆ కారణంగా మంచు మునిగే బదులు తేలుతుంది. అందువల్ల ధృవ ప్రాంత సముద్ర జలాలు అంతటి శీతలంలోనూ తేలే మంచు గడ్డల కింద, వెచ్చగా, ద్రవ రూపంలోనే ఉండి.. జీవాలు సజీవంగా, సౌకర్యంగా ఉండేలా చేస్తాయి! నీటికున్న మరో అద్భుత లక్షణం అనేక పదార్థాలను కరిగించడం. ఈ ఒక్క లక్షణం గనుక నీటికి లేకపోతే, అసలు ఈ భూమ్మీద జీవం పుట్టేదే కాదేమో! పుట్టినా, ఒక్క క్షణమైనా జీవించి ఉండేదే కాదు.
 

సముద్ర పునరుజ్జీవం.. సాముహిక భాగస్వామ్యం..

ఎందుకీ రోజు?
సముద్రాలు గ్రహానికి ఊపిరితిత్తులుగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే మనం పీల్చే ఆక్సిజన్‌లో ఎక్కువ శాతాన్ని సముద్రాలే అందిస్తాయి మరి! మన దేహంలో ఊపిరితిత్తులను మన వల్లే ఏర్పడుతున్న కాలుష్యం ఏవిధంగా నష్టపరుస్తుందో, అంతకుమించి మన నిర్లక్ష్యం మహా సముద్రాలను మహా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. కాకపోతే ఆ విషయం ఇలా ప్రతి ఏడాది, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జూన్‌ 8న మాత్రమే మన అవగాహనకు వస్తుంది. మన జీవితంలో మహాసముద్రాల పాత్రను అందరికీ గుర్తు చేసేందుకు ప్రతి సంవత్సరం జూన్‌ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని పాటిస్తూ వస్తున్నారు. సముద్రంపై మానవ చర్యల ప్రభావం గురించి ప్రజలకు తెలియజేయడం, సముద్ర సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం, వాటి నిర్వహణ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సేవలను సమీకరించి, ఏకం చేయడం ఈ ప్రత్యేక రోజు ఉద్దేశ్యం. రియో డి జనీరోలో 1992లో జరిగిన పర్యావరణం, అభివృద్ధిపై యుఎన్‌ సమావేశం తర్వాత నుండి చాలా దేశాలు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 2008లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2009 జూన్‌ 8ని 'ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం'గా గుర్తించాలని నిర్ణయించింది. ఈ ఏడాది (2022) ప్రపంచ మహాసముద్ర దినోత్సవ థీమ్‌ 'పునరుజ్జీవం: మహాసముద్రం కోసం సామూహిక చర్యలు'.
 

sea

సముద్రమా, మహా సముద్రమా?
సముద్రం ఒక అపార జల విస్తారం అయినప్పటికీ, శాస్త్రవేత్తలు దానిని పసిఫిక్‌, అట్లాంటిక్‌, హిందూ, ఆర్కిటిక్‌ అనే నాలుగు మహా సముద్రాలుగా విభజించారు. మొదటి మూడు మహాసముద్రాలు అంటార్కిటికా చుట్టూ మంచుతో నిండిన నీటిలో కలిసిపోతాయి. కొంతమంది శాస్త్రవేత్తలు అంటార్కిటికాని ఐదో మహాసముద్రంగా నిర్వచించారు. దీనిని దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తారు. భూమిపై 50 కంటే ఎక్కువ సముద్రాలు ఉన్నాయి.
మనం సాధారణంగా సముద్రం (సీ) అనే పదాన్ని మహాసముద్రాన్ని (ఓషన్‌) సూచించడానికీ ఉపయోగిస్తాము. భౌగోళిక శాస్త్రవేత్తలకు మాత్రం, సముద్రం అనేది మహా సముద్రంలో ఒక విభజన. అన్ని సముద్రాల జలాలూ ఉప్పగా ఉంటాయి. కొన్ని సముద్రాలను బేస్‌ అని పిలుస్తారు (భారతదేశం, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఇండోనేషియా మధ్య బంగాళాఖాతం వంటివి). కొన్ని సరస్సులను సైతం సముద్రాలు అని పిలుస్తారు (కాస్పియన్‌ సముద్రం వంటివి).
 

sea

సముద్రాలు.. ప్రజలు..
అక్టోబర్‌ 2021లో, యుఎన్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ మొదటిసారిగా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, స్థిరమైన పర్యావరణం మానవహక్కు అని గుర్తించింది. కానీ సముద్ర కాలుష్యం, సముద్ర మట్టం పెరగడం, అతిగా చేపలు పట్టడం వంటివి మానవ హక్కులను ఉల్లంఘనే. మొత్తం మానవ జనాభాలో మూడింట ఒకవంతు, దాదాపు 240 కోట్ల ప్రజలు, సముద్ర తీరానికి 100 కి.మీ లోపల నివసిస్తున్నారు. మూడొందల కోట్లకు పైగా ప్రజలు జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, సముద్ర, తీరప్రాంత వనరులు, పరిశ్రమల మార్కెట్‌ విలువ సంవత్సరానికి మూడు లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో ఐదు శాతం అని అంచనా.
మెరైన్‌ ఫిషరీస్‌ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా 400 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2010లో యుఎన్‌ నీటిని మానవహక్కుగా గుర్తించింది. అనేక మందికి తాగునీరు, పారిశుధ్యం, వ్యవసాయ నీటిపారుదల అనే విషయాలు అత్యంత సాధారణ విషయాలుగా భావించి, వాటిని పట్టించుకోవడం లేదు. అయితే, భూమిపై నీటి చక్రాన్ని నడిపించడానికీ, స్వచ్ఛమైన గాలిని సృష్టించడానికీ సముద్రం లేకుండా, మన ఉనికి కూడా కష్టం అన్న వాస్తవం మనం గ్రహించాలి.
భూమిపై ఉన్న చాలా సంస్కృతులు సముద్రానికి విలువనిస్తాయి, వేడుక చేసుకుంటాయి. కొన్నిసార్లు భయపడతాయి కూడా. సముద్రం మనకు పురాణాలు, ఇతిహాసాల గాథలను అందించింది. అనేక కళలకు, సంగీతం, ఆటలకు ప్రేరణనిచ్చింది. మనలో చాలా మంది సముద్రానికి సంబంధించి, బీచ్‌లు, స్విమ్మింగ్‌, సర్ఫింగ్‌, సెయిలింగ్‌, డ్రైవింగ్‌ వంటి కార్యకలాపాలను ఆనందిస్తారు. సముద్రాలు మనకు పోషకాహారం, ఔషధాలు, ఖనిజ, పునరుత్పాదక ఇంధన వనరులను అందిస్తాయి. సముద్రాలు ఫిషింగ్‌, సీఫుడ్‌, లీజర్‌, సైన్స్‌లో ఉద్యోగాలకు అవకాశం ఇస్తాయి. సముద్రం ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థలను ఒకదానితో ఒకటి కలుపుతూ, వస్తువులను, ప్రజలను ప్రపంచమంతటా రవాణా చేసే సూపర్‌ రహదారి.
సముద్రాలూ, వాతావరణ మార్పు
మానవ కార్యకలాపాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు సముద్రం వేడెక్కడం, ఆమ్లీకరణం, వాతావరణంలో ఆక్సిజన్‌ తగ్గుదలకు కారణమవుతున్నాయి. మానవులు ఉత్పత్తి చేసే కార్బన్‌ డై ఆక్సైడ్‌లో దాదాపు 30 శాతం మహాసముద్రాలు గ్రహించి, గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను తగ్గిస్తాయి. సముద్రం భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది, నియంత్రిస్తుంది. పారిశ్రామీకరణ ప్రారంభమైనప్పటి నుండి, మానవ కారణ వాతావరణ మార్పుల నుండి పుట్టిన ఉష్ణంలో 90 శాతం కంటే ఎక్కువ వేడిని, ప్రపంచంలోని కర్బన ఉద్గారాలలో మూడింట ఒక వంతును సముద్రాలు నిల్వ చేసుకున్నాయి. సముద్రాలలో మడ అడవులు, సముద్రపు గడ్డి, ఉప్పు, చిత్తడి నేలలు వంటి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలను మనం రక్షించుకుంటూ, వాటిని పునరుద్ధరించాలి. అలా చేసినట్లయితే, అవి 2050 నాటికి 140 కోట్ల టన్నుల కంటే ఎక్కువ కర్బన ఉద్గారాలను నిల్వ చేయడంలో సహాయపడతాయి.
జీవ వైవిధ్యంపై కన్వెన్షన్‌ వెలువరించిన వివరాల ప్రకారం, లోతైన సముద్రపు జీవ జాతులే 5,00,000 నుంచి కోటి మధ్య ఉన్నాయి. అయితే, సముద్రంలోని 80 శాతం ఇంకా మానవులకు తెలియదు. పైగా 91 శాతం సముద్ర జాతులు ఇప్పటికీ సమగ్రంగా వివరించబడలేదు. మనం నిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాము. మన సముద్రం గురించి అవగాహన పెంచుకుని, దాని సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.

sea


సముద్రాలు.. కాలుష్యం..
భూమిపై ఉన్న సహజ వనరులకు కాపరిగా మానవుడి పాత్ర నిరుత్సాహపరిచినప్పటికీ, సముద్రాన్ని మార్చి, పాడుచేసే సామర్ధ్యం మాత్రం అతడికి లేదనే నమ్మకంలో కొంతకాలం మనం గడిపాము. కానీ ఈ నమ్మకం త్వరగానే అమాయకమైనదిగా నిరూపించబడింది. పరమాణువు యొక్క రహస్యాలను ఛేదించడంలో ఆధునిక మానవుడు ఒక గడ్డు సమస్యను ఎదుర్కొన్నాడు. భూ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన పదార్థాలైన పరమాణు విచ్ఛిత్తి తాలూకు ఉప-ఉత్పత్తులను ఏమి చేయాలి అనేది అతనికి తీవ్రమైన సమస్య. ఆ సమస్యకు పరిష్కారం సముద్రం. అపారమైన విస్తారత, మానవ ఆవాసాలకు సుదూరంగా ఉండటం వంటి లక్షణాలు సముద్రాన్ని సహజమైన డస్ట్‌బిన్‌గా మార్చివేశాయి.
దాదాపు 80 శాతం సముద్ర, తీర ప్రాంత కాలుష్యం భూమిపైనే ఉద్భవించింది - వ్యవసాయ కార్యకలాపాల నుండి సముద్ర జలాల్లో కలిసే ఎరువులు, పురుగుమందులు.. ప్లాస్టిక్‌లు, శుద్ధిచేయని మురుగునీరు. వీటితో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ పది లక్షల ప్లాస్టిక్‌ నీళ్లబాటిళ్లు కొనుగోలు చేయబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదు లక్షల కోట్ల వరకూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు ఉపయోగించబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? దశాబ్దాల పాటు మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగం, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ల పెరుగుదల ప్రపంచ పర్యావరణ విపత్తుకు దారితీసింది. ప్రతి సంవత్సరం 13,000,000 టన్నుల ప్లాస్టిక్‌ సముద్రంలోకి వెళుతోంది. అది ఇతర నష్టాలతోబాటు, ఏటా 1,00,000 సముద్ర జాతులను పొట్టన పెట్టుకుంటోంది. చాలా ప్లాస్టిక్‌లు దశాబ్దాలు, శతాబ్దాల పాటు జీర్ణం కాకుండా, చెక్కుచెదరకుండా ఉంటాయని అంచన. అయినప్పటికీ, కొన్ని రకాల సూక్ష్మ-ప్లాస్టిక్‌లు, చేపలు, ఇతర సముద్ర ప్రాణులచే వినియోగించబడి, క్షీణించబడతాయి. ఇవే సులువుగా ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి.
సముద్ర రవాణాతో సహా స్థిరమైన, శీతోష్ణస్థితికి అనువుగా ఉండే రవాణా, స్థిరమైన అభివృద్ధికి కీలకం. వస్తువుల అంతర్జాతీయ వాణిజ్య పరిమాణంలో దాదాపు 80 శాతం సముద్రం ద్వారానే జరుగుతుంది. అలాగే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంది.
కడలిలో అడవులు..
అడవి అనగానే, భూమి పై ఉండే దట్టమైన చెట్లు, జంతువులూ ఉండే ప్రదేశం ఊహించుకుంటాం. కానీ అడవులు నీటి కింద, సముద్రాల్లోనూ ఉన్నాయి. అవి చాలా అందంగా, విలువైనవిగా ఉన్నాయి. నీలి అడవులు అని పిలవబడే వాటిలో చెట్లు లేకపోయినా, ఈ గ్రహం మీద జీవించడానికి చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. మడ అడవులు ఉప్పు తట్టుకోగల చెట్లు, పొదలు. ఇవి తీరప్రాంతాలలో పెరుగుతాయి. అవి విస్తారమైన జీవవైవిధ్యానికి ఆధారం. ఈ అడవులు తుపాను, ఉప్పెనలు, సునామీలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కోతకు వ్యతిరేకంగా సహజ తీర రక్షణగా పనిచేస్తాయి.
సముద్రపు గడ్డి అనేది పుష్పించే మొక్కలు. ఇవి ఉష్ణమండలం నుండి ఆర్కిటిక్‌ సర్కిల్‌ వరకూ తక్కువ లోతు నీటిలో కనిపిస్తాయి. ఇవి కోత నుండి తీరాలను రక్షిస్తాయి.. కార్బన్‌ను నిల్వ చేస్తాయి. ఆరోగ్యకరమైన చేపల నిల్వలను ఉత్పత్తి చేయడంలో సహాయపడటం ద్వారా ఆహార భద్రతకు దోహదం చేస్తాయి. ఇవి వాతావరణ మార్పులకు శక్తివంతమైన ప్రకృతి-ఆధారిత పరిష్కారం. ఇవి మైక్రోప్లాస్టిక్‌లను వడ కట్టి, జలాలను కాలుష్యం నుండి దూరం చేయడంలో సహాయపడతాయని ఇటీవల కనుగొనబడింది. కానీ ప్రతి అరగంటకూ ఒక ఫుట్‌బాల్‌ మైదానానికి సమానమైన సముద్రపు గడ్డి అడవులు కోల్పోతున్నాయని అంచనా. కెల్ప్‌ అడవులు కొన్నిసార్లు ఒక రోజులో రెండడుగుల వరకూ పెరుగుతాయి. కెల్ప్‌ అడవులు ఇప్పుడు ఔషధం, ఆహారం, పరిశ్రమలు, పశుగ్రాసం, వ్యవసాయ భూముల కోసం పండించబడుతున్నాయి. కెల్ప్‌, ఆల్గే యొక్క ఇతర జాతులు పెరగడానికి ఎరువులు అవసరం లేదు.. కేవలం సూర్యకాంతి, కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీరు చాలు!
 

sea

ముప్పు ఎవరికి?
ఎప్పుడూ తనది కానిది ఏదో ఒకటి లాక్కోవడం అలవాటైన మనిషి తనకు తెలిసినంత కొద్దిలోనే సముద్రాన్ని వాడేస్తున్నాడు. కడలి జలనిధులు అనంతం, అందులో నుండి మనం కొంత తీసుకుంటే దానికి నష్టం ఏమిటి అనే ధోరణిలో విపరీతంగా పీడిస్తున్నాడు. అతిగా చేపల వేట, పగడాల వేట, ముత్యాల వేట కొనసాగుతూనే ఉంది. సముద్ర జలాలపై ప్రయాణాలు చేస్తూ, తీరాల వెంబడి ఆనందిస్తూ, వ్యాపారాలు చేస్తూ, భూమిపై అత్యంత పెద్ద చెత్త కుండీగా సముద్రాన్ని మార్చేశాడు. సముద్రం మానవాళిని కలిపే బంధం, మన ఉనికికి విలువైన ఆధారం. ఇప్పడు సముద్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం సముద్రానికి మాత్రమే కాదు, దానిపై ఆధారపడిన మనందరికీ.
జీవం మొదట ఉద్భవించినది సముద్రంలోనే. జన్మనిచ్చిన తల్లి రొమ్ము గుద్దినట్టు ఇప్పుడు ఆ జీవం యొక్క ఒక రూపం తన కార్యకలాపాలతో సముద్రానికే ముప్పు కలిగిస్తుందనేది విచిత్రమైన వాస్తవ పరిస్థితి. కానీ అటువైపు ఉన్నది సముద్రం.. మహా సముద్రం. ఎటువంటి ముప్పులనైనా తట్టుకుని, గర్భంలో దాచుకుని, క్షమించాను పో అన్నట్టు అలలెత్తి చూస్తూ, విస్తరించి, గుంభనంగా ఉంటుంది. అసలు ముప్పు సముద్రం పుట్టించిన జీవానికే!

sea


తీరప్రాంత నగరాలకు పొంచిన ప్రమాదం..!
రానున్న 80 ఏళ్లలో దేశంలోని 12 తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉందని ఐపీసీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదికపై దేశవ్యాప్తంగా సముద్ర భూ వాతావరణ నిపుణుల్లో చర్చ జరుగుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సంస్థ ఐపీసీసీ. దీనిని 1988లో యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రాం, వరల్డ్‌ మెటీరియలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా స్థాపించాయి.
పర్యావరణంలో పెరుగుతున్న అసమానతల కారణంగా 2100 నాటికి తీరప్రాంత నగరాలు మునిగిపోనున్నాయని ఐపీసీసీ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న నగరాలపై రిపోర్టును తయారుచేసింది. నాసా రూపొందించిన ప్రొజెక్షన్‌ టూల్‌ ద్వారా ఐపీసీసీ రిపోర్ట్‌ని పరిశీలిస్తే ఖిదిర్పుర్‌ 0.16 మీటర్లు, విశాఖ 0.54, కాండ్లా 0.57, మంగళూరు 0.57, చెన్నరు 0.57, ముంబయి 0.58, తూత్తుకుడి 0.59, పారాదీప్‌ 0.59, ఓఖా 0.60, మోర్ముగావ్‌ 0.63, కొచ్చి 0.71, భావ్‌ నగర్‌లో 0.82 మీటర్ల మేర 2100 నాటికి సముద్రమట్టాలు పెరగనున్నాయని పేర్కొంది. ఈ 12 తీర ప్రాంతాల్లో కనిష్టంగా 0.16 మీటర్ల నుంచి గరిష్టంగా 0.82 మీటర్ల వరకూ సముద్రమట్టాలు పెరుగుతాయని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ మాజీ రీజనల్‌ హెడ్‌ డాక్టర్‌ జీపీఎస్‌ మూర్తి తెలిపారు.

sea


పసిఫిక్‌లో అగ్నిపర్వతాల విస్ఫోటనం..
ఓ వైపు గ్లోబల్‌ వార్మింగ్‌, మరోవైపు భూకంపాలు, సునామీలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. పైగా గ్లోబల్‌ వార్మింగ్‌ని నియంత్రించేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాకపోవడం గమనార్హం. అయితే గతేడాది డిసెంబర్‌లో అగ్రరాజ్యం అమెరికాతోపాటు పసిఫిక్‌ సముద్ర తీరం ఉన్న పలు దేశాలకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ పసిఫిక్‌లోని ద్వీప దేశం టోంగాలో సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం.. కనీ వినీ ఎరుగని రీతిలో విస్ఫోటనం చెందడంతో సముద్రంలో భూకంపం చెలరేగి, భారీ సునామీ అలలు ఏర్పడ్డాయి. అమెరికా పశ్చిమ తీరంతోపాటు టోంగా, ఫిజీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో భారీ సునామీ రావొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఈ విస్ఫోటనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఎనిమిది నిమిషాల పాటు సంభవించిన ఈ పేలుడు బీభత్సంగా ఉందని, దీనికి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిజీలో 'పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు' వినిపించాయని రాజధాని సువాలోని అధికారులు వివరించారు.
20 కిలోమీటర్లు విస్తరించిన వాయువులు..
అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వెలువడిన వాయువులు, పొగ, బూడిద... ఆకాశంలో 20 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించాయని టోంగా జియోలాజికల్‌ సర్వీసెస్‌ చెప్పింది. 'హుంగా టోంగా-హుంగా హాపై' అగ్నిపర్వత శ్రేణికి ఉత్తరాన 65 కి.మీ దూరంలోనే టోంగా రాజధాని 'నుకులోఫా' ఉంటుంది. అక్కడ 1.2 మీ. ఎత్తున్న సునామీ అలలు కనిపించాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది. 'దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన, అసాధారణమైన వరదలు, తీర ప్రాంతాల్లో అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశముందని 'నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ' తెలిపింది.

డా. కాకర్లమూడి విజయ్