Sep 20,2023 22:21

సమస్యను పరిష్కరించకనే..! ఫొటోలకు ఫోజులిచ్చిన అధికారులు

సమస్యను పరిష్కరించకనే..!
ఫొటోలకు ఫోజులిచ్చిన అధికారులు
ప్రజాశక్తి -తొట్టంబేడు
సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు అధికారులు ఫోటోలకు ఫోజులివ్వడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తొట్టంబేడు మండలం చోడవరంలో మురుగునీరు వీధుల్లో నిల్వచేరుతోంది. దీంతో గ్రామస్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై బుధవారం పత్రికల్లో కథనం ప్రచురితమైంది. ఈ కథనాలపై స్పందించిన తొట్టంబేడు ఎంపీడీవో సురేష్‌ బాబు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి సమస్య పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌ బాబు, మరో కార్యదర్శి సింధూజ, మహిళా పోలీసు త్రివేణి, వెల్ఫేర్‌ అసిస్టెంటు రాజశేఖర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంటు అశోక్‌ స్థానిక సర్పంచ్‌ వెంకట్రమణారెడ్డితో కలసి చోడవరంలో గ్రామ సభ నిర్వహించారు. ఓ కుటుంబం వారు కాలువకు అడ్డంగా మట్టి తోలి పూడ్చి వేయడంతో మురుగు నీరు వీధుల్లో నిల్వ చేరుతోందని... అదేవిధంగా ఓ వ్యక్తి పంట కాలువ ఆక్రమించు కోవడం కూడా ఈ సమస్య వస్తోందని గ్రామస్థులు గ్రామ సభలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పరిష్కరించడానికి అధికారులు సరైన హామీ ఇవ్వలేదు. అయితే చోడవరంలో మురుగు కాలువకు అడ్డంగా తోలిన మట్టిని తొలగించామని... ఇకపై ఇక్కడ సమస్య ఉండదంటూ సీనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌ బాబు పేరున పత్రికలకు ప్రకటన జారీ చేశారు. ప్రజాశక్తి క్షేత్ర స్థాయిలో విచారించగా అధికారులు చేసిన ప్రకటన వాస్తవం కాదన్నారు. అధికారులు ఇలా ఎందుకు ప్రకటన ఇచ్చారో తమకు అర్థం కావడం లేదని చోడవరం వాసులు అంటున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి ఈ మురుగు నీటి సమస్యను పరిష్కరించ వలసి ఉంది. అదేవిధంగా ఆక్రమణకు గురైన పంట కాలువకు విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.