Nov 03,2023 23:59

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జెసి, సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-తెనాలి : ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించేందుకు రూపొందించిన కార్యక్రమమే 'జగనన్నకు చెబుదాం' అని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు. స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ 79 అర్జీలు స్వీకరించారు. వీటిని పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖలకు పంపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలన్నింటినీ పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. పంచాయతీలకు సంబంధించిన సమస్యలు అధికంగా వస్తున్నాయని, ఆయా సమస్యలపై జెడ్పీ సిఈవో, ఎంపిడివోలు, డిఎల్‌డీవోలు సమిష్టిగా పరిష్కరించాలని, సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని సూచించామని అన్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు రైతు భరోసా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎరువులు, విత్తనాల వంటి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించామన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా సాగునీటి విడుదలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిచాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్‌వాడి కేంద్రాలను పరిశీలించాలని, గృహనిర్మాణ శాఖ అదికారులు జగనన్న లేఔట్‌లు పరిశీలించాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్‌ 1902కు కూడా ఫోన్‌ చేయవచ్చన్నారు. కార్యక్రమం ప్రారంభంలో వచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీ సిఈవో జె.మోహనరావుతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.