Oct 05,2023 23:20

తాడేపల్లి పట్టణంలో పాదయాత్ర బృందానికి వినతిపత్రం ఇస్తున్న మహిళలు

ప్రజాశక్తి-తాడేపల్లి, తాడేపల్లి రూరల్‌: ప్రజల ఆవేనలు వింటూ.. వారి నుండి నివేదనలు స్వీకరిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం చేపట్టిన పాదయాత్ర మూడోరోజైన గురువారం ఉత్సాహంగా సాగింది. పాదయాత్రకు ప్రజలు ఎక్కడికక్కడ ఘనస్వాగతం పలకడంతోపాటు తమ సమస్యలను, ఆవేదనలను వివరించి వినతిపత్రాలు ఇస్తున్నారు. ప్రధాన సమస్య ఇళ్లు, ఇళ్లస్థలాలు, పట్టాలు కావాలని అందుకు మీరు తమకు అండగా నిలవాలని సిపిఎం నాయకులను ప్రజలు కోరుతున్నారు. క్రిష్టియన్‌పేటలో సిఎం గన్నవరం వెళ్తున్న నేపథ్యంలో పాదయాత్ర వాహనాలు అక్కడ నిలపడానికి వీల్లేదని పోలీసులు హడావుడి చేశారు. సిపిఎం నాయకులు పోలీసులతో సమన్వయం చేసుకుని బకింగ్‌హామ్‌ కాల్వ బ్రిడ్జి ఇవతల అమరారెడ్డినగర్‌ ప్రాంతంలో నిలుపుదల చేయడంతో స్వల్ప వివాదం సద్దుమణిగింది.
గురువారం ఉదయం సుందరయ్యనగర్‌ లీలా సుందరయ్య కళా వేదిక దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర బృందానికి స్థానికులు పూలు జల్లుతూ హారతులు పడుతూ స్వాగతం పలికారు. మణిపాల్‌ ఆసుపత్రి, విజయవాడ క్లబ్‌ మీదుగా గోకార్టింగ్‌ ఎదురుగా పొలాల గుండా సిఎస్‌ఆర్‌ కల్యాణ మండం రోడ్డులోకి పాదయాత్ర చేరుకుంది. ఇక్కడ ప్రధానంగా మురుగు సమస్య తీవ్రంగా ఉందని అపార్టుమెంట్‌ వాసులు వాపోయారు. మురుగునీరు నిలబడటంతో దోమల బెడద అధికంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాదయాత్ర బృందం తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. అక్కడ నుంచి క్రిష్టియన్‌పేటకు పాదయాత్ర చేరుకుంది. అల్పాహారం అనంతరం అమరారెడ్డికాలనీ, యానాదుల కాలనీ, యర్ర మస్తాన్‌రెడ్డి కాలనీ ప్రాంతాల్లో పర్యటించింది. ముఖ్యంగా ఈ ప్రారతంలో అధిక సంఖ్యలో అర్జీలు పాదయాత్ర బృందానికి అందజేశారు. ప్రధాన సమస్యగా ఇళ్లు, ఇళ్లస్థలాలు, పట్టాలు ప్రభుత్వం ఇవ్వాలని విన్నవించారు. తమకు అన్ని సౌకర్యాలు ఉన్న ఇక్కడ నుంచి కదలించవద్దని కోరారు. ఇక్కడ తాము అన్ని రకాల సౌకర్యాలతో ఉంటున్నామని, ఎక్కడో రాజధాని సెంటు స్థలం మాకు వద్దని చెప్పారు. తాము ఇక్కడే ముమ్మాటికి ఉంటామని, పనులు కూడా కొద్దోగొప్పో దొరుకుతున్నాయని చెప్పారు. శ్మశానాల అవతల యానాదుల కాలనీ వాసులు పెద్దఎత్తున పాదయాత్రకు స్వాగతం పలికారు. తాము ఇక్కడే ఉంటామని, మరెక్కడి వెళ్లేది లేదని, అందుకు సిపిఎం చేసే అందోళనల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. అక్కడ నుంచి పాదయాత్ర గత ప్రభుత్వం రిజర్వ్‌ జోన్‌గా ప్రకటించిన యు1 రిజర్వ్‌ జోన్‌ పంట పొలాలను పరిశీలించారు. తమ ప్రభుత్వం వస్తే జోన్‌ ఎత్తివేస్తామని అప్పటి ప్రతిపక్ష నాయకుడు, నేటి సిఎం జగన్‌ చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదు. జోన్‌ ఎత్తివేయడానికి రెండు శాతం పన్ను కట్టాలని సిఆర్‌డిఎ అధికారులు నిబంధన పెట్టడంతో రిజర్వ్‌ జోన్‌ సమస్య పరిష్కారం కాలేదు. అక్కడు నుండి యర్ర మస్తాన్‌రెడ్డి కాలనీ మదర్‌ థెరిస్సా కాలనీలోకి ప్రవేశించింది.
ఎక్కడున్న వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలి : రామారావు
తాడేపల్లి పట్టణంలో వేలాది మంది పేదలు నివశిస్తున్న సుందరయ్యనగర్‌, మహానాడు, అమరారెడ్డినగర్‌, యానాదుల కాలనీ, యర్ర మస్తాన్‌రెడ్డకాలనీలతో పాటు ఇరిగేషన్‌, రైల్వే, కొండ పోరంబోకు స్థలాల్లో ఉంటున్న పేదలకు ప్రస్తుతం ఎక్కడుంటున్న వారికి అక్కడే పట్టాలివ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. సిఎం నివాసానికి కూత వేటు దూరంలో ఉంటున్న ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. వివిధ పోరంబోకు స్థలాల్లో ఉంటున్న పేదలకు యుద్ధప్రాతిపదికన పట్టాలు మంజూరు చేయాలన్నారు. కాల్వ గట్ల సుందరీకరణ పేరుతో పేదలను వేరే చోటకు తరలించేందుకు ప్రభుత్వం చూస్తోందని, పేదలను అడవి లాంటి వేరే ప్రాంతాలకు తరలిస్తే వారి బతుకు ఛిద్రం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు యు1 రిజర్వ్‌ జోన్‌ను పన్ను చెల్లించకుండా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వ్‌ జోన్‌ ఎత్తివేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కె.కరుణాకరరావు, కొత్తూరు శాఖ కార్యదర్శి డి.విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ఇళ్లు తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. బాధితులకు సిపిఎం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పేదల నివసించే ప్రాంతాలలో పేదలు పిడబ్ల్యూడి కాల్వకట్టపై వేసుకున్న ఇళ్లను రెగ్యులర్‌ చేసి పట్టాలు ఇవ్వాల్సిందేనని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి, మదర్‌థెరిస్సా కాలనీలో ప్రజా చైతన్య పాదయాత్ర సాగింది. బృందానికి పిడబ్ల్యూడి కాల్వకట్లపై నివసించే మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వివరించి వినతిపత్రాలిచ్చారు. స్థానికంగా ఉన్న సిసి రోడ్లు ఎత్తు పెంచి, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని అర్జీలిచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతన చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని పారిశుధ్య కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. పాశం రామారావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలం ఇచ్చి, పక్కా గహాలు కట్టిస్తామని చెప్పిన వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వకపోగా కాల్వ కట్టల సుందరీకిరణ పేరుతో పిడబ్యూడి కాల్వకట్లపై నివసించే పేదల ఇళ్లను తొలగించేందుకు పూనుకున్నారని విమర్శించారు. కుంచనపల్లిలోని సుమారు 200 కుటుంబాలు పేదలు కాల్వ కట్టల పై నివసిస్తున్నారని, ఇరిగేషన్‌ అధికారులు ఇల్లు తొలగించాలని నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేస్తుంటే, పేదలకు ఇళ్ల స్థలాలు రాజధానిలో ఇస్తామంటూ వైసిపి పేదలను మభ్యపెడుతోందన్నారు. ఒకవైపున నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు వేస్తున్నాయని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా ప్రజానాట్య మండలి కళాకారులు తమ గేయాలతో ఉత్సాహాన్ని నింపాచరు. పాదయాత్రలో కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.సూర్యారావు, ఇ.అప్పారావు, ఎం.రవి, ఎస్‌ఎస్‌ చెంగయ్య, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకులు జొన్న శిశంకరరావు నాయకులు డి.వెంకటరెడ్డి, బి.దుర్గారావు, వి.వెంకటేశ్వరరావు, వై.కమలాకర్‌, ఎం.రాజముని, డి.శ్రీనివాసకుమారి, కె.ఉషారాణి, ఎ.శౌరిబర్తులం, బి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.ముత్యాలరావు, కె.బాబూరావు, కె.మేరి, బి.రామారావు, వై.కోటేశ్వరరావు, వై.బర్నబస్‌, ఐ.ఇస్సాక్‌, చిన్ని, కె.ప్రభాకర్‌, కొండబాబు, బాలాజీ, సిహెచ్‌.భుజంగరావు, యేషయ్య, ఎల్‌.ఆచారి, ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, డి.విజయభాస్కరరెడ్డి, కె.యశోద పాల్గొన్నారు.