ఆరు గ్రామాల మీదుగా 19 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర
పోరుకేక బృందానికి వెల్లువెత్తిన సంఘీభావం
అడుగడుగునా ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
అంతా కలిసికట్టుగా పోరాడుతామని సభల్లో నేతల పిలుపు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/కుక్కునూరు/ జీలుగుమిల్లి/బుట్టాయగూడెం
నిర్వాసితుల సమస్యలను ఆలకిస్తూ.. కర్తవ్యం నిర్దేశిస్తూ జిల్లాలో రెండోరోజు మంగళవారం ఆరు గ్రామాల మీదుగా 19 కిలోమీటర్ల మేర పోలవరం పోరుకేక మహాపాదయాత్ర సాగింది. ఉదయం ఎనిమిది గంటలకు కుక్కునూరు మండలం దాచారంలో యాత్ర ప్రారంభమైంది. పది గంటలకు మండల కేంద్రమైన కుక్కునూరు చేరుకుంది. ఈ బృందానికి టిడిపి, జనసేన, సిపిఐ నాయకులు సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు. టిడిపి నాయకులు మునిశెట్టి నాగు, జనసేన నాయకులు మునిశెట్టి యుగంధర్ వి.శ్రీనివాసరావుకు నిర్వాసితుల సమస్యలను వివరించారు. స్థానిక నిర్వాసితులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో.. పరిహారం అందకపోవడం, ఇళ్లు నిర్మించకపోవడం వంటి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం జరిగిన సభలో వీరంతా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుక్కునూరు చేరుకుని పాదయాత్ర బృందానికి సంఘీభావం తెలపడమే కాకుండా రోజుంతా పాదయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం జీలుగుమిల్లి మండలంలోని రాచన్నగూడేనికి యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో పలువురు నేతలు ప్రసంగించారు.
ముంపులో లక్షా ఐదు వేల కుటుంబాలు
మంతెన సీతారాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
పోలవరంలో ముంపునకు గురవుతున్న ఎనిమిది మండలాల్లో దాదాపు లక్షా ఐదు వేల కుటంబాలు నిర్వాసితులవుతున్నాయని మంతెన సీతారాం తెలిపారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్లుగా వారి పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు భూమికి భూమి, 18 ఏళ్లు నిండిన వారికి పునరావాస పరిహారం, వ్యవసాయ కూలీలకు ప్యాకేజీ, కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాల్సి ఉందన్నారు. సిఎం జగన్ మాత్రం ఏమీ చేయడం లేదన్నారు. రాచన్నగూడెం పోరాటాల గడ్డ అని, నిర్వాసితులకు అండగా నిలవాలని అన్నారు. మనం ఎకరా భూమి పోతే చాలా బాధపడతామని, నిర్వాసితులు సర్వం కోల్పోతున్నారని అన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ నిర్వాసితులను ముంచేస్తున్నారన్నారు. గతేడాది వచ్చిన గోదావరి వరద మోడీ, జగన్ తెచ్చిందేనన్నారు. మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది మాదిరి అడవులు, కొండల పాలు చేయకుండా వెంటనే పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని, వరద పరిహారం ఇవ్వాలని కోరారు.
బతికేందుకు దారి చూపేందుకే పోరుకేక
డి.రమాదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోలవరం పోరుకేక పాదయాత్ర మణులు, మాణిక్యాల కోసం జరగడం లేదని, నిర్వాసితులు బతికేందుకు దారిచూపాలని కోరుతుందని డి.రమాదేవి అన్నారు. లక్షల కుటుంబాలను ముంచి ఎవరికి నీరిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు బాధ్యత మాది అని చెప్పిన కేంద్రం పూర్తిగా నిధులివ్వడం లేదన్నారు. కేంద్రంలో అమానవీయ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అడగలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. 90 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్న జగన్ ముంపు మండలాల పరిస్థితి చెప్పాలన్నారు. అమ్మఒడి, వృద్ధాప్య పింఛను ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. గతేడాది వరదలకు ఇక్కడి ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు. ప్రాజెక్టు కట్టి తెచ్చిన వరద అని అన్నారు. ఇప్పటి వరకూ పదిశాతం కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. వచ్చేనెల నాలుగో తేదీన జరిగే సభకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.
నిర్వాసితులకు అండగా నిలబడదాం
ఎ.రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి
అంతా పోలవరం నిర్వాసితులకు అండగా నిలబడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. జీలుగుమిల్లి మండలంలో నిర్వాసితులకు అత్యధిక కాలనీలు నిర్మిస్తున్నారని, వారందరికీ మనం అండగా ఉండాలని కోరారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్వాసితులకు దిక్కులేదని, జీలుగుమిల్లి మండలంలో బంగారుపాపమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. జీలుగుమిల్లిలో ఆయుధ ఫ్యాక్టరీ నిర్మిస్తే జీలుగుమిల్లి, వంకావారిగూడెం పంచాయతీలు ఖాళీ చేయాల్సి వస్తుందన్నారు. దీన్ని అందరూ తిప్పికొట్టాలన్నారు. 1/70 చట్టం గిరిజనేతరులకు ఎలాంటి నష్టమూ ఉండదన్నారు. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు అధ్యక్షత వహించారు. సంఘీభావం ప్రకటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వాసితుల సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, అల్లూరి జిల్లా కార్యదర్శి బి.కిరణ్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, విఆర్.పురం ఎంపిపి కారం లక్ష్మి, నాయకులు తెల్లం రామకృష్ణ, మొడియం నాగమణి, వాణిశ్రీ, రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నేత ప్రసన్న కుమార్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర నేత రాము, ప్రజానాట్య మండలి రాష్ట్ర నేత మంగరాజు పాల్గొన్నారు.










