ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సమస్యలను వింటూ... విజ్ఞాపనలను అందకుంటూ... భరోసానందిస్తూ... సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు తాడిపత్రిలో ప్రవేశించిన యాత్ర రాత్రికి గుత్తికి చేరింది. గురువారం ఉదయం అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర పామిడి మీదుగా అనంతపురానికి మధ్యాహ్నానికి చేరుకుంది. అక్కడ బైపాస్‌లోని తపోవనంలో సిపిఎం నగర నాయకులు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైకు ర్యాలీ ముందురాగా ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర వారి వెంట సాగింది. టవర్‌క్లాక్ వద్ద నుంచి పెద్దఎత్తున ప్రజలు రావడంతో అక్కడి నుంచి ప్రదర్శనగా సప్తగిరి సర్కిల్ మీదుగా బహిరంగ సభా ప్రదేశం నగర పాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. డప్పుల ప్రదర్శనతో సాగిన ప్రదర్శన అందరిలోనూ ఉత్సహాన్ని నింపింది. అనంతపురం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ, హిందూపురం మీదుగా రాత్రికి పుట్టపర్తికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లోనూ యాత్ర బృందానికి ఘనస్వాగతం లభించింది.
విజ్ఞాపనలు అందుకుంటూ...
సిపిఎం ప్రజారక్షణ భేరి బృందానికి పెద్దఎత్తునే విజ్ఞాపనలు అందుతున్నాయి. పామిడి ప్రాంతంలో రైతు సమస్యలు రాగా, అనంతపురం నగరంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్సు, అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అందజేశారు. ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని భగత్‌సింగ్ ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. హమాలీ వర్కర్స్‌కు సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతపురం నగరంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలివ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. పెనుకొండ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పేదలు వినతిపత్రం అందజేశారు. రొద్దం మండలం కోగిర, శ్యాపురం, కంబాలపల్లి తదితర గ్రామాలకు చెందిన సాగుదారులు పట్టాలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
కరువు కనిపించడం లేదా
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్
రాయలసీమ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నా కనీస సమీక్షలు చేసే మంత్రులు కూడా కరువయ్యారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ విమర్శించారు. పంటలు ఎండిపోయి ఉపాధి లేక ఈప్రాంతం నుంచి వలసలు పోతున్నా పట్టించుకునే నాథుడు లేకుండాపోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేనలకు కూర్చీల కోట్లాట తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని చెప్పారు. అందుకే సిపిఎం ప్రజా రక్షణ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను అజెండాలోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కరువు మండలాల ప్రకటనలో అనేక మండలాలను మినహాయించడం సరైంది కాదని అన్నారు. ఒకే వాతావరణ పరిస్థితులున్నా మండలాలను కరువు మండలాల నుంచి ఎందుకు మినహాయించారో తెలియదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకురాలు నాగవేణి మాట్లాడుతూ పెనుకొండలో పేదలు ఇళ్ల స్థలాలను కొండగుట్టల్లో వేసుకున్నా అధికారులు తొలగించడాన్ని తప్పుబట్టారు. పెద్దలకు వందల ఎకరాలు కట్టబెట్టే పాలకులు పేదలకు మాత్రం సెంటు భూమి ఇవ్వడానికి సిద్ధపడటం లేదని విమర్శించారు. రాష్ట్ర కమిట సభ్యులు దయా రమాదేవి మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. వైసిపి, టిడిపి, జనసేనలు దానితో అంటగాగుతున్నాయని విమర్శించారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని వైసిపి అధికారంలోకి వచ్చాక విస్మరింంచిందని సిపిఎం రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా ఆంధ్రరాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు తెలిపారు. పరిశ్రమల పేరుతో సాగుభూములను తీసుకుని రైతులను మోసం చేశారు తప్పా ఒక్క పరిశ్రమా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, వి.రాంభూపాల్, రాష్ట్ర నాయకులు నాగవేణి, సీనియర్ నాయకులు జి.ఓబుళు, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, అనంతపురం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య, సిపిఎం అనంతపురం నగర కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, సిపిఎం నాయకులు సావిత్రి, దిల్‌షాద్, శ్రీసత్యసాయి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.పెద్దన్న, నాయకులు జంగాలపల్లి పెద్దన్న, జెడ్పీ శ్రీనివాసులు, కౌలురైతు సంఘం జిల్లా కన్వీనర్ కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాలు, సాగుపట్టాల కోసం పోరాటం
ఎం.ఇంతియాజ్, సిపిఎం శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు... సాగు రైతులకు భూములు దక్కే వరకు వారికి అండగా పోరాటాలను ఉదతం చేస్తామని సిపిఎం శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ తెలిపారు. సత్యసాయి జిల్లాలో 5000 మందికి ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఊళ్లు నిర్మిస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి పేదలుకన్పించడం లేదాని ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో సాగుభూములను తీసుకుని రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరి పక్షాన సిపిఎం పోరాటం నిర్వహిస్తుందని చెప్పారు.
కార్మిక చట్టాలను అమలు చేయండి : గఫూర్
నియోజకవర్గం పరిధిలో ఉన్న పారిశ్రామికవాడలో కార్మిక చట్టాలను అమలు చేసి, కార్మికులను ఆదుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్వులు గఫూర్ డిమాండ్ చేశారు. హిందూపురంలో బిపిఎల్ షోరూం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హిందూపురం పారిశ్రామికవాడలో కార్మిక చట్టాలు అమలుకాలేదన్నారు. కనీసవేతనాలు, పనిగంటలు జాడలేదన్నారు. లేపాక్షి మండలం కొండూరు వద్ద దళితులకు చెందిన 145 ఎకరాల భూమిని ఒక బిజెపి నేత అక్రమంగా అధికారులకు ముడుపు ఇచ్చి రాత్రికిరాత్రే రికార్డులను మార్చుకుని ఆక్రమించుకున్నా అధికార, ప్రతిపక్షాల నాయకులు నోరుమెదపలేదన్నారు. చిలమత్తూరు మండలంలో పరిశ్రమల కోసం భూములను తీసుకుని వెంచర్లు వేసి బహిరంగంగా అమ్ముతున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.










