ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, ముసునూరు
జనం సమస్యలు వింటూ.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో రెండోరోజు శనివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి నుంచి ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సింహాద్రిపురం, మండల కేంద్రం ముసునూరు మీదుగా వలసపల్లి వరకూ దాదాపు 17.2 కిలోమీటర్ల మేర సాగింది. ముసునూరు మండలం సింహాద్రిపురం గ్రామంలోకి పాదయాత్ర చేరుకోగానే మహిళలు గజమాలతో స్వాగతం పలికారు. నేలపాటివారికుంట వద్దకు చేరేసరికి 2600 కిలోమీటర్లు మైలురాయిని దాటిన సందర్భంగా తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్ధే రఘుబాబు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వేంపాడు కాలువ వద్ద చెక్కపల్లి గ్రామ రైతులు గజమాలతో సత్కరించారు. రాష్ట్ర సగర సంఘం నాయకులు, దళితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ లోకేష్‌కు వినతిపత్రాలు అందించారు. బోర్డు బల్ల సెంటరు వద్ద మానం వంశీ తోడ్పాటుతో వేల్పుచర్ల గ్రామ మహిళలకు కుట్టు మిషన్లను లోకేష్, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. మహిళలు, యువత, వృద్ధులతో లోకేష్ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు.
రచ్చబండలో జనంతో ముఖాముఖి
ముసునూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ దృష్టికి గ్రామస్తులు డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తికాక సాగునీరు అందకపోవడం, ఎంఎల్‌ఎ అవినీతి, సంక్షేమ కార్యక్రమాల రద్దు, ఇసుక కొరత తదితర సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తనది బటన్ ప్రభుత్వం అని పదేపదే చెబుతున్నాడని, ఇప్పుడు ఆ బటన్‌కు పవర్ పోయిందని అన్నారు. అప్పిచ్చే వాడు లేక బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదని తెలిపారు. జగన్ ప్రజలపై భారాలు వేసి సంక్షేమం అంటున్నాడని విమర్శించారు. ముసునూరుకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, కొత్త రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. జగన్ చేసే సైకో పనులు చూసి సైకో అనడం తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమీ చేయలేదన్నారు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే ఇప్పుడు జగన్ పాలనలో రూ.ఐదు వేలు ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు తగ్గిస్తామన్నారు. పంచాయతీ పాలనా సమస్యలపై సర్పంచి విజయలక్ష్మి వివరించారు.
పాదయాత్రకు రక్షణ కల్పించాలని ఎస్‌పికి వినతి
లోకేష్ పాదయాత్రకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని, రక్షణ కల్పించాలని టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నేతలు జిల్లా ఎస్‌పి మేరీప్రశాంతిని శనివారం కలిసి వినతిపత్రం అందించారు. శుక్రవారం వైసిపి శ్రేణులు, టిడిపి మధ్య జరిగిన ఘర్షణపై నూజివీడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మాగంటిబాబు స్థానిక టిడిపి నేత పాకా శ్రీను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
నేడు పాదయాత్ర ఇలా
ఏలూరు జిల్లాలో మూడో రోజు ఆదివారం పాదయాత్ర ఇలా సాగనుంది. ఉదయం పాదయాత్రకు విరామం ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు వలసపల్లి బస నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 4.30 గంటలకు వలసపల్లిలో స్థానికులతో సమావేశం, 4.50 గంటలకు చింతలపూడి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తోంది. 6.20 గంటలకు ధర్మాజీగూడెంలో స్థానికులతో సమావేశం, 7.50 గంటలకు మట్టంగూడెంలో స్థానికులతో సమావేశం, 8.20 గంటలకు సుందర్రావుపేట స్థానికులతో సమావేశం, 8.50 గంటలకు సుందర్రావుపేట శివార్లలో బస చేయనున్నారు.










