ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అంగన్వాడీల సమస్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి వీడి ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో దశల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద మోడీ, జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 36 గంటలు అంగన్వాడీలు తలపెట్టిన నిరసన మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంతో ముగిసింది. కలక్టరేట్ వద్ద నిరసన శిబిరం వద్దే అంగన్వాడీలంతా నిద్రించారు. అక్కడే వంటా వార్పు చేసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ 36 గంటలు శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసినా జగన్ ప్రభుత్వ వైఖరిలో మార్పు కనబడటం లేదన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాల్సి వస్తుందన్నారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రావతి మాట్లాడుతూ మడమ తిప్పడు మాట తప్పడు అనేది అబద్ధమని, జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పాడని విమర్శించారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ అంగన్‌వాడీలు రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ప్రతి అంగన్‌వాడీ వర్కర్ తలుచుకుంటే 1000 మంది ప్రజలను ప్రభావితం చేయగలరని, అంగన్వాడీల సునామీలో కొట్టుకుపోవడానికి జగన్ సిద్ధపడాలని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కృత్తికా శుక్లాకు వినతిపత్రం అందించారు. నిరసన శిబిరానికి వచ్చిన ఐసిడిఎస్ జిల్లా పిడీ కె.ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆమె తెలిపారు. శిబిరం ముగింపు సందర్బంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ వందన సమర్పణ చేశారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నరేష్, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అప్పారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమణి, ఎంఆర్‌పిఆస్ నాయకులు వల్లూరి సత్తిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సూరిబాబు మద్దతు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు, మున్సిపల్ క్యాబ్ డ్రైవర్స్, ఆశా కార్యకర్తలు సహకరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు సతన్నారాయణ, షేక్ పద్మ, రొంగల ఈశ్వరరావు, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షులు రాజా, భాస్కర్, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు నాగురా, జ్యోతి, చామంతి, జిల్లా నలుమూలల నుండి 10 ప్రాజెక్టుల నుంచి అంగన్వాడీలు పాల్గొన్నారు.










