Oct 05,2023 22:16

తిమ్మిరాజుపల్లి హరిజనవాడ వద్ద వర్షానికి కొట్టుకుపోయిన ఆర్‌ అండ్‌ బి రోడ్డు (ఫైల్‌)

సమస్యలు 'సారూ..'.. స్పందించాలి 'మీరు'
నేడు ఆర్‌సిపురంలో 'జగనన్నకు చెబుదాం'
ప్రజాశక్తి - రామచంద్రాపురం : ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారంలో ప్రతి బుధ, శుక్రవారాల్లో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. మండల పరిధిలో వస్తున్న సమస్యలను జిల్లాస్థాయి అధికారి స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం మండలంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని మండలవాసులు కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డిని కోరుతున్నారు.
అనుపల్లి పంచాయతీలో 2017వ సంవత్సరంలో 150 మందికి సంబంధించిన 300 ఎకరాల డీకేటీ పట్టాల రద్దుపై న్యాయం చేయాలని రైతుల కోరుతున్నారు.
సి రామాపురం. అనుపల్లి, నెత్తకుప్పం, నెన్నూరు. సి.కె పల్లి రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు( వాగు. గుట్ట. కాలువ, చెరువు. కుంట పరంబోకు స్థలాలు ) యథేచ్ఛగా కబ్జా అవుతూ భవనాలు వెలుస్తున్నాయి.
- సి రామాపురంలో గ్రామ కంఠం సర్వే నెంబర్లు వేసి గుట్ట పోరంబోకు స్థలాలను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
- మండలంలో ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది.
- అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించడం వల్ల దోమల బెడద ఎక్కువై ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
- ప్రభుత్వ కార్యాలయాలలో సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం పౌరులకు అధికారులు సేవలు అందించడం లేదని, ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
- మండలంలో మద్యం బెల్టు షాపులు. నాటు సారా విక్రయాలు, నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
- రెవెన్యూ శాఖలో రైతుల భూములు, ఒకరి భూమిని... వేరొకరి పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
- వ్యవసాయ శాఖలో రాయితీలతో ఇచ్చే ప్లాస్టిక్‌ పైపులు, యంత్రాలు, వేరుశనగ విత్తనాలు సక్రమంగా అందడం లేదు.
- రాయలచెరువు- అనుపల్లి రోడ్డు మార్గంలో తిమ్మరాజు పల్లి హరిజనవాడ వద్ద కల్వర్టు నిర్మాణం, కూనేపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో నలరాళ్ల వంకపై వంతెన నిర్మించాలని దళితులు కోరుతున్నారు.
- రామచంద్రపురం మండలానికి ఆనుకొని ఉన్న స్వర్ణముఖి నదిపై వంతెన నిర్మించి రహదారి సౌకర్యం కల్పించాలి.
- నెన్నూరు వద్ద రాయల చెరువు సప్లై ఛానల్‌ పై వంతెన నిర్మించాలి, అలాగే వెంకట్రామాపురం నుండి తిరుపతికి వెళ్లే మార్గంలో నక్కల వాగుపై వంతెన నిర్మించాలి.
తిమ్మిరాజుపల్లి హరిజనవాడ వద్ద వర్షానికి కొట్టుకుపోయిన ఆర్‌ అండ్‌ బి రోడ్డు (ఫైల్‌)