ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
సమస్యలు పట్టించుకోని పాలకవర్గాల విధానాన్ని ప్రశ్నించడంతోపాటు పరిష్కరించే దాకా ప్రజలందరినీ కూడగట్టి ఉద్యమాలు నిర్వహిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజార్ సర్కిల్ వద్ద సిపిఎం జిల్లా నాయకులు సి.గోవిందు అధ్యక్షతన జీపుజాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు మాట్లాడారు. కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులుగా అత్యున్నత పదవులు అలంకరించారని తెలిపారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జిల్లాకు చేసింది మాత్రం శూన్యమన్నారు. కర్నూలు జిల్లా రెండుగా విడిపోయిన తర్వాత కరువు ప్రాంతం మాత్రమే కర్నూలు జిల్లాగా మిగిలిపోయిందన్నారు. జిల్లా సంక్షేమం పట్టని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ వందలాదిమందితో ఈనెల 26 నుంచి 31 వరకు ఆదోని నుంచి కర్నూలు కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించి, వేలాది మందితో మహాధర్నాను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఎక్కడికక్కడ వాటి పరిష్కారం కోరుతూ సచివాలయ అధికారులకు వినతులు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రశ్నించే వారిగా తీర్చిదిద్దేందుకు జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో జీపుజాతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మిగనూరు నుంచి ప్రారంభించిన ఈ జీపుజాతా ఎమ్మిగనూరు పట్టణం, మంత్రాలయం, నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ సాగుతుందని వివరించారు. ఆదోని, ఎమ్మిగనూరు మధ్య టెక్స్‌టైల్స్ పార్కు నిర్మించాలని, ఆర్‌డిఎస్ కుడికాలువను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గురురాఘవేంద్ర ఎత్తిపోతల స్కీంను పూర్తి చేయాలని, మంత్రాలయం, నాగులదిన్నె, సుంకేసుల మీదుగా రోడ్డు పూర్తి చేయాలని కోరారు. బనవాసిలో అగ్రికల్చర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఎమ్మిగనూరులో లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ రోడ్లు నిర్మించాలని కోరారు. పట్టణంలో, శివారు కాలనీల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.రాధాకష్ణ, కెవి.నారాయణ, జిల్లా నాయకులు ఎమ్‌డి.ఆనంద్ బాబు, ఎమ్‌డి.అంజిబాబు, గురుశేఖర్, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి హనుమంతు, నాయకులు రాముడు, లక్ష్మీ నరసయ్య, సురేష్, నరసింహులు, బి.రాజు, కరుణాకర్, అబ్దుల్, ఆంథోని, రాజు, రమేష్, కాలప్ప, కృష్ణ పాల్గొన్నారు.










