డిఆర్‌సి సమావేశంలో గళమెత్తిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు
కొల్లేరులో తాగునీటి చెరువు తవ్వకాలు చేపట్టాలి
ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు, ఆరోగ్య సమస్యలు ఏకరువు
రబీ ధాన్యం కొనుగోలులో సమస్యలు లేకుండా చర్యలకు డిమాండ్
తాగునీటి సమస్య పరిష్కారానికి పటిష్ట చర్యలు: ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కొల్లేరు ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో తాగునీటి చెరువులకు అనుబంధంగా మరో తాగునీటి చెరువు తవ్వుకునేందుకు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించి కొల్లేరులో తాగునీటి చెరువులు తవ్వుకునేందుకు చర్యలు తీసుకోవాలని కొల్లేరును ఆనుకుని ఉన్న కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు ఎంఎల్‌ఎలు కోరారు. గురువారం డిఆర్‌సి సమావేశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో జరిగింది. సమావేశానికి ఏలూరు జిల్లాలోని ఎంఎల్‌ఎలు ఆళ్ల నాని, అబ్బాయిచౌదరి, పుప్పాల వాసుబాబు, ఎలిజా, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్‌అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎంఎల్‌సిలు షేక్ సాబ్జీ, ఐ.వెంకటేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు. తొలుత గడిచిన నవంబర్‌లో జరిగిన డిఆర్‌సి సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై తీసుకున్న చర్యలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వివరించారు. పేదలందరికీ ఇళ్లు, ఉపాధిహామీ, నాడు-నేడు, గ్రామీణ నీటిపారుదల, వ్యవసాయం అనుబంధ రంగాలు, ఆరోగ్యం, గడపగడపకు ప్రభుత్వం వంటి ఎనిమిది అంశాలను అజెండాగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో అనేక లేఅవుట్లలో పూడిక చేయలేదన్నారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. అనేక లేఅవుట్లకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొన్ని లేఅవుట్లు ఇళ్లు కట్టుకోవడానికి యోగ్యంగా లేవని, భూసేకరణ చేసి ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 46 లేఅవుట్లలో ఇళ్లు కట్టే పరిస్థితి లేదన్నారు. పూడిక చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని తెలిపారు. ఉపాధి హామీలో చేస్తున్న జలకళ అత్యంత దారుణంగా మారిందని, బిల్లులు రావడం లేదన్నారు. సచివాలయ, విలేజీ క్లినిక్‌లు, రైతుభరోసా కేంద్రాల భవనాలు నిర్మించిన వారికి సొమ్ము రావడం లేదని, ప్రభుత్వం నుంచి ఇచ్చే సిమెంట్ సరిగా అందడం లేదని తెలిపారు. కొల్లేరు గ్రామాల్లో తాగేంందుకు గుక్కెడు నీరు లేదని ఎంఎల్‌ఎలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. హ్యాండ్ బోర్లు రిపేరు చేయాలని కోరారు. రబీలో నూరుశాతం ధాన్యం కొనుగోలు చేయాలని, సంచులు, లారీల సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు మెడికల్ కాలేజీలో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్
ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. గురువారం ఏలూరులో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం మంత్రి విశ్వరూప్ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. నీటిఎద్దడి తలెత్తకుండా ఏలూరు జిల్లాలో రూ.63.14 లక్షలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన అంశాలను ఆయా నియోజకవర్గాల వారీగా సమీక్షించామన్నారు. ముఖ్యంగా కొల్లేరు పరిధిలోని కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కొల్లేరు పరిధిలో ఏవిధమైన కాల్వలు లేనందున ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అటవీశాఖ అధికారులను సమన్వయం చేసుకొని తాగునీటి చెరువుల తవ్వకం విషయంపై ఇప్పటికే సంబంధిత ఎంఎల్‌ఎ, జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి చెరువుల ఏర్పాటు కోసం ప్రత్యేక అనుమతుల కోసం సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ప్రయివేటు వ్యక్తులకు అప్పగించకుండా తహశీల్దారు, ఆర్‌డిఒ పర్యవేక్షణలో తాగునీటి చెరువులు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. తాగునీటి చెరువులు నింపేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఒహెచ్‌ఎస్‌ఆర్‌లను పూర్తిస్థాయిలో నీటితో నింపి ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. రబీ ధాన్యం కొనుగోలు విషయంపై గత ఖరీఫ్‌లో గుర్తించిన సమస్యలను అధిగమించి గోనె సంచుల సరఫరా, లారీల రవాణా తదితర అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకునేలా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. జిల్లాకు నిర్ధేశించిన ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయడంతోపాటు ఇంకా ఎంత ధాన్యం ఉన్నా కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల అకాల వర్షాల మూలంగా పోలవరం తదితర నియోజకవర్గాల్లో పొగాకు, మొక్కజొన్న దెబ్బతిన్నాయని, ఆయా పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్ చేశారని చెప్పారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే తక్షణమే వారికి పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వీలుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి సంబంధించి ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, డిఎంహెచ్‌ఒ కోవిడ్ పరీక్షలకు సంబంధించి కిట్లను అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సిద్ధంగా ఉంచారన్నారు. మొదటి, రెండో వేవ్‌లో తలెత్తిన తీవ్రమైన పరిణామాలు ఇప్పుడు సంభవించవని, అయినప్పటికీ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యత్రాంగం అన్ని చర్యలూ తీసుకుందని తెలిపారు. ఏలూరు జిజిహెచ్ వైద్య కళాశాలగా అనుబంధంగా రూపాంతరం చెందిన దృష్ట్యా తొలిదశలో కొన్ని సమస్యలు ఎదురౌతున్నాయని, వాటిని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో మెడికల్ కౌన్సిల్ బృందం దీన్ని పరిశీలించేందుకు రానుందన్నారు. స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని విశ్వరూప్ స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, జిల్లా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










