Feb 14,2023 23:46

ప్రజాశక్తి-విజయవాడ: గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు డిఎ రూ.300 వేతనంతో కలిపి పూర్తిగా ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఫేస్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ వేయాలనే నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలను రూ.26 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. నెలకు రూ.300 చొప్పున మూడు సంవత్సరాల డిఎ ఒకే సారి రూ.పది వేలకు పైగా విఆర్‌ఎల నుంచి ప్రభుత్వం రికవరీ చేసిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హక్కుగా వస్తున్న డిఎను విఆర్‌ఎలు కోల్పోయారన్నారు. విఆర్‌ఎలకు వేతనంతో పాటు డిఎను కూడా కలిపి ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, ఇప్పటి వరకు రికవరీ చేసిన డిఎను తిరిగి విఆర్‌ఎల ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. వయసు పైబడిన వారు, నామినీలుగా పని చేస్తున్న వారు ఫేస్‌యాప్‌ ద్వారా అటెండెన్స్‌ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. గతంలోనూ యూనియన్‌ విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.బాబురావు, విఆర్‌ఎ సంఘం నాయకులు కె శ్రీనివాసరావు, టి నరసింహారావు, ఎస్‌కె సైదులు, జి జానకిరామయ్య, కె గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.