Jul 05,2023 21:54

ఫొటో : మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న ఎ.ఐ.టి.యు.సి. నాయకులు

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం..
ప్రజాశక్తి-కావలి : అపరీష్కృతంగా ఉన్న పారిశుధ్య కార్మికుల సమస్యలు వెంటనే 15రోజుల్లోగా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటియుసి) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం యూనియన్‌ నాయకులు మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మల్లె అంకయ్య, ఎండ్లూరి ఆదినారాయణ, కె.నాగరాజు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల యు.ఎ.ఎన్‌. నెంబరుకు ఆధార్‌కు లింక్‌ చేయాలన్నారు.
వారి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులందరికీ సబ్బులు, నూనెలు, యూనిఫారం, చెప్పులు వెంటనే ఇవ్వాలన్నారు. 60 సంవత్సరాల వయస్సు పేరుతో తొలగించిన కార్మికులందరి వారసులను పనిలో పెట్టుకోవాలన్నారు. వారి ఇ.పి.ఎఫ్‌.ను సెటిల్‌మెంట్‌ చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు జి.ఒ. ప్రకారం జీతాలు ఇవ్వాలన్నారు. కావలి పట్టణ జనాభాకు అనుగుణంగా, విస్తీర్ణం మేరకు తగిన సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ వర్కర్ల చిన్నచిన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు గుంజి కిషోర్‌, ఎ.ప్రభావతి, వేణు, ఎ.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.